Jagan: జగన్ పై హత్యాయత్నం కేసు.. సిట్ విచారణకు హాజరైన వైసీపీ నేత మళ్ల విజయప్రసాద్!
- కోడికత్తి, రక్తపు చొక్కాపై ప్రశ్నించిన అధికారులు
- విజయప్రసాద్ వాంగ్మూలం నమోదు
- కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటానన్న నేత
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం కేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మళ్ల విజయప్రసాద్ ఈ రోజు సిట్ అధికారుల ముందు హాజరయ్యారు. విశాఖపట్నంలో సిట్ అధికారుల విచారణకు హాజరైన విజయప్రసాద్.. తన వాంగ్మూలం ఇచ్చారు. జగన్ పై దాడి జరిగిన తీరు, కోడికత్తి, రక్తపు మరకలున్న జగన్ చొక్కా సహా పలు అంశాలపై ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా విజయప్రసాద్ మాట్లాడుతూ.. హైకోర్టు ఉత్తర్వుల మేరకు తాను నడుచుకుంటానని సిట్ కు తెలిపారు. ఈ నెల 27న జగన్ పై హత్యాయత్నం కేసును హైకోర్టు విచారించనుందనీ, హైకోర్టు ఇచ్చే ఆదేశాలను పాటిస్తానని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ఏడాది అక్టోబర్ 25న హైదరాబాద్ కు వస్తున్న జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ లోని సిటీ న్యూరో వైద్యులు జగన్ గాయానికి ఆపరేషన్ నిర్వహించి 9 కుట్లు వేశారు.