srilanka: స్మగ్లింగ్ కేసులో శ్రీలంక క్రికెట్ దిగ్గజం సనత్ జయసూర్య
- వక్కల స్మగ్లింగ్ లో జయసూర్యతో పాటు మరో ఇద్దరు క్రికెటర్లు
- నాగపూర్ లో బయటకు వచ్చిన జయసూర్య పేరు
- విచారణ కోసం ఇప్పటికే ఒకసారి ముంబై వచ్చిన జయసూర్య
ప్రపంచ క్రికెట్ చరిత్రలో శ్రీలంక మాజీ బ్యాట్స్ మెన్ సనత్ జయసూర్యది ఒక అధ్యాయం. వన్డే క్రికెట్ కు దూకుడు నేర్పిన క్రికెటర్లలో అతను ఒకడు. అలాంటి క్రికెట్ దిగ్గజంపై ఇప్పుడు స్మగ్లింగ్ ఆరోపణలు వచ్చాయి. వివరాల్లోకి వెళ్తే, శ్రీలంక నుంచి దిగుమతి అయిన కోట్ల విలువైన వక్కలను నాగ్ పూర్ లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సీజ్ చేసింది.
ఈ సమయంలో జయసూర్య పేరు బయటకు వచ్చినట్టు దైనిక్ భాస్కర్ పత్రిక తెలిపింది. జయసూర్యతో పాటు మరో ఇద్దరు క్రికెటర్లు కూడా ఈ స్మగ్లింగ్ లో పాలుపంచుకున్నట్టు పేర్కొంది. అయితే మిగిలిన ఇద్దరి పేర్లు ఇంకా బయటకు రాలేదు. వీరందరినీ డిసెంబర్ 2న విచారణకు పిలిచే అవకాశం ఉంది. మరోవైపు, ఇప్పటికే విచారణ కోసం జయసూర్య ఒకసారి ముంబై వచ్చినట్టు తెలుస్తోంది.
ఇండొనేషియా నుంచి ఇండియాకు వక్కలను ఎగుమతి చేస్తారు. నేరుగా ఎగుమతి చేస్తే అధిక పన్నులను (108 శాతం దిగుమతి పన్ను) చెల్లించాల్సి ఉంటుంది. దీంతో, మలేషియా నుంచి శ్రీలంకకు తీసుకొచ్చి, అక్కడి నుంచి ఇండియాకు తరలిస్తారు. శ్రీలంక నుంచి ఇండియాకు వస్తే సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా చట్టం కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. దీంతో, వ్యాపారులు శ్రీలంకను అక్రమమార్గంగా ఎంచుకున్నారు. ఈ వ్యాపారం కోసం జయసూర్యతో పాటు ఇతర క్రికెటర్లు డమ్మీ కంపెనీలను ఏర్పాటు చేసుకున్నారు. తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని... వీరు ఆ సంస్థలకు అనుమతులు పొందారని విచారణలో తేలింది.