KCR: కేసీఆర్ నోట ఓటమి మాట.. దుమ్మెత్తి పోస్తున్న ప్రతిపక్షాలు
- కేసీఆర్ ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
- గెలిస్తేనే ప్రజలు కావాలా?
- ఓటమిని ముందే అంగీకరించారంటున్న ప్రతిపక్షాలు
నిర్మల్ సభలో టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమయ్యాయి. విమర్శల దాడి కూడా మొదలైంది. నిర్మల్ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. ఒకవేళ పార్టీ ఓటమి పాలైతే తనకొచ్చే నష్టం ఏమీ లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రజలే నష్టపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఓడితే హాయిగా వెళ్లి ఫామ్ హౌస్లో కూర్చుని వ్యవసాయం చేసుకుంటానని పేర్కొన్నారు. గెలిపిస్తే పనిచేస్తానని, లేదంటే ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటానని చెప్పడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెను విమర్శలకు దారి తీసింది.
కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలకు ముందే ఆయనకు ‘బొమ్మ’ కనిపిస్తోందని, ఓటమిని అంగీకరిస్తున్నారని చెబుతున్నారు. గెలిస్తే రాజకీయాలు, లేదంటే ప్రజలను వారి మానాన వారిని వదిలేసి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటానని చెప్పడం కేసీఆర్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పరాకాష్ట అని దుమ్మెత్తి పోస్తున్నారు. గెలిచినా, ఓడినా ప్రజల్లోనే ఉండాలన్న కనీస సూత్రాన్ని కేసీఆర్ మర్చిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కూడా ఉదహరిస్తున్నారు. తాను ఓడిపోతే అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకుంటానని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబం మొత్తం ఇటువంటి ఆలోచనతోనే ఉందని, గెలిస్తేనే వారికి ప్రజలు కావాలని, లేదంటే వారితో అవసరం ఉండదని తమ వ్యాఖ్యల ద్వారా నిరూపిస్తున్నారని మండిపడుతున్నారు.