polavaram: పోలవరం ప్రాజెక్టును ఆపాలంటూ ఒడిశా పిటిషన్.. 27న విచారణ
- శరవేగంగా జరుగుతున్న ప్రాజెక్టు పనులు
- ‘పోలవరం’ వల్ల తీరని అన్యాయం జరుగుతుందన్న ఒడిశా
- తక్షణం ఆపించాలంటూ సుప్రీంకోర్టుకు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు పనులను సత్వరం ఆపివేయించాలంటూ ఒడిశా వేసిన పిటిషన్ను ఈ నెల 27న విచారించనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశాకు తీరని నష్టం జరుగుతుందని, కాబట్టి వెంటనే పనులు ఆపాలని ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ నవీన్ పట్నాయక్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. తమ వ్యాజ్యాన్ని త్వరగా విచారించాలని అభ్యర్థించింది. దీంతో స్పందించిన సుప్రీంకోర్టు ఈ నెల 27న దీనిపై విచారణ చేపడతామని వెల్లడించింది.
మరోవైపు, ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పనుల్లో జోరు పెంచింది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి ప్రాజెక్టును సిద్ధం చేయాలని గట్టి పట్టుదలతో ఉంది. దీంతోపాటు ఇతర ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని యోచిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనులను సమీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా వేసిన వ్యాజ్యం ప్రాధాన్యం సంతరించుకుంది. కోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం ఎలా ముందుకెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.