Amaravathi: ఏపీ శాసనసభ భవన సముదాయం డిజైన్ ఖరారు.. ‘తిరగేసిన లిల్లీ పువ్వు’కే ఓటు
- ఈ నెల 30న నిర్మాణానికి టెండర్లు
- రెండేళ్లలో పూర్తి
- 250 మీటర్ల ఎత్తుతో నిర్మాణం
ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ భవన నిర్మాణానికి సంబంధించిన డిజైన్ ఖరారైంది. ఐకానిక్ కట్టడాల డిజైనింగ్‌లో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన లండన్‌కు చెందిన ఫోస్టర్ ప్లస్ పార్ట్నర్స్ సంస్థ తుది డిజైన్‌ను ఏపీ ప్రభుత్వానికి అందించింది. ‘తిరగేసిన లిల్లీ’పువ్వులా కనిపించే శాసనసభ భవనం చుట్టూ నీటి కొలనుల మధ్య స్వాతిముత్యంలా కనిపించనుంది. ఎత్తు 250 మీటర్లు.
గతంలోని డిజైన్‌కు మరికొన్ని హంగులద్ది మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. అసెంబ్లీ టవర్లతోపాటు నిర్మించనున్న సచివాలయ టవర్ల నమూనాలను కూడా గురువారం సీఎం చంద్రబాబు పరిశీలించారు. వీటిలో చిన్నపాటి మార్పులు సూచించారు. త్వరలో జరగనున్న సమావేశంలో ఈ డిజైన్లను ఖరారు చేసే అవకాశం ఉంది.
డిజైన్లు ఖరారైన అనంతరం ఈ నెల 30న అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. అంతేకాదు, రెండేళ్లలోనే దీని నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోనున్నారు. అమరావతిలో చేపట్టిన జస్టిస్ సిటీ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నట్టు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. భూములు కేటాయించినా పనులు ప్రారంభించని సంస్థలకు నోటీసులు జారీ చేయనున్నట్టు పేర్కొన్నారు.