railway special trains: శీతాకాలంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు : 90 అదనపు సర్వీసులు
- డిసెంబరు 9 నుంచి జనవరి 18 వరకు అందుబాటులోకి సేవలు
- పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు
- శనివారం నుంచి ఈ రైళ్లకు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం
శబరిమల తదితర పుణ్యక్షేత్రాలు దర్శించే భక్తుల అవసరం, సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ఈ చలి కాలంలో పలు ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని డిసెంబరు 9 నుంచి జనవరి 18 మధ్య మొత్తం 90 ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తేనుంది. ఇందులో హైదరాబాద్ నుంచి ముప్పై ఏడు, కాకినాడ నుంచి ఇరవై ఎనిమిది, నిజామాబాద్ నుంచి ఐదు, మచిలీపట్నం, తిరుపతి నుంచి నాలుగేసి, గుంటూరు, విజయవాడ, కాచిగూడ, కొల్లం, నర్సాపూర్ నుంచి రెండేసి సర్వీసులు నడపనుంది.
అలాగే, కరీంనగర్, సిర్పూర్, అకొలా, ఆదిలాబాద్ నుంచి ఒక్కో సర్వీస్‌ను నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లలో ప్రయాణించదల్చుకున్న వారు శనివారం నుంచి రిజర్వేషన్ చేయించుకోవచ్చు. హైదరాబాద్ నుంచి కొల్లంకు వయా కాజీపేట, విజయవాడ, గూడూరు, రేణిగుంట, మెల్‌పక్కం మీదుగా 15 రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి వయా వికారాబాద్, రాయచూర్, గుంతకల్, రేణిగుంట, మెల్‌పక్కం మీదుగా పదహారు, వయా నడికుడి, గుంటూరు, గూడూరు, రేణిగుంట, మెల్‌పక్కం మీదుగా ఆరు సర్వీసులు తిరగనున్నాయి.
నిజామాబాద్-కొల్లం-నిజామాబాద్ మధ్య ఐదు, కరీంనగర్-కొల్లం మధ్య ఒకటి, కాచిగూడ-కొల్లం-కాచిగూడ మధ్య రెండు, సిర్పూర్ కాగజ్‌నగర్-కొల్లం మధ్య రెండు, కాకినాడ-కొల్లం-కాకినాడ మధ్య ఇరవై ఎనిమిది రైళ్లు నడపనున్నారు. నర్సాపూర్-కొల్లం-నర్సాపూర్ మధ్య రెండు, మచిలీపట్నం-కొల్లం-మచిలీపట్నం వయా గుంటూరు, రేణిగుంట, మెల్‌పక్కం మీదుగా నాలుగు, వయా గుంటూరు, తిరుపతి, కాట్‌పాడి మీదుగా రెండు, విజయవాడ-కొల్లం-విజయవాడ మధ్య రెండు, అకోలా-కొల్లం మధ్య ఒకటి, ఆదిలాబాద్-కొల్లం మధ్య ఒకటి, కొల్లం-తిరుపతి మధ్య రెండు, తిరుపతి-అకోలా మధ్య ఒకటి, తిరుపతి-ఆదిలాబాద్ మధ్య ఒకటి చొప్పున ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.