Hyderabad: పాపం.. ఓటున్నా వేసుకోలేని నేతలు వీరే.. తెలంగాణ నేతలకు చిత్రమైన పరిస్థితి
- పోటీ చేస్తున్నది ఒక చోట.. ఓటు మరొక చోట
- గ్రేటర్ హైదరాబాద్‌లో నేతల పరిస్థితి
- ఎక్కువ మంది నేతలకు నిరాశే
తెలంగాణ ఎన్నికల్లో ఈసారి కొందరు నేతలకు విచిత్రమైన అనుభవం ఎదురుకాబోతోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో బరిలో ఉన్న నేతల్లో చాలామంది తమకు తాము ఓటేసుకోలేని పరిస్థితి ఉంది. వారి ఓటు ఉన్నది ఒక నియోజకవర్గంలో అయితే, వారు పోటీ చేసేది మరో నియోజకవర్గంలో కావడమే అందుకు కారణం. అటువంటి నేతల్లో కొందరు..
దాసోజు శ్రవణ్: కాంగ్రెస్ నేత అయిన దాసోజు ఖైరతాబాద్ నుంచి బరిలో ఉన్నారు. కానీ ఆయన ఓటు ఉన్నది అంబర్‌పేటలో
నందమూరి సుహాసిని: కూకట్పల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆమె ఓటు నాంపల్లి నియోజకవర్గంలో ఉంది.
జాఫర్ హుస్సేన్: నాంపల్లి నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన ఓటు బహదూర్‌పుర నియోజకవర్గంలో ఉంది.
అనిల్ కుమార్ యాదవ్: ఆయన ఓటు చార్మినార్‌లో ఉంది. పోటీ చేస్తున్నది మాత్రం ముషీరాబాద్ నుంచి
సబితా ఇంద్రారెడ్డి: మహేశ్వరం నుంచి బరిలోకి దిగుతున్న మాజీ మంత్రి ఓటు చేవెళ్లలో ఉంది.
బద్దం బాల్‌రెడ్డి: ఆయన ఓటు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. బరిలో ఉన్నది మాత్రం రాజేంద్రనగర్ నుంచి
తలసాని శ్రీనివాస్ యాదవ్: సనత్‌నగర్ నుంచి పోటీ పడుతున్న ఆయన ఓటు కంటోన్మెంట్ పరిధిలో ఉంది.
వీరితోపాటు నాంపల్లి బీజేపీ అభ్యర్థి దేవర కరుణాకర్, శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి జి.యోగానంద్, టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్, మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు, యాకుత్‌పురా ఎంఐఎం అభ్యర్థి పాషాఖాద్రి, ఉప్పల్ టీడీపీ అభ్యర్థి వీరేందర్‌గౌడ్, సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ వంటి నేతలు కూడా తమ ఓటును తమకు వేసుకోలేని స్థితిలో ఉన్నారు.