Rajive Bajaz: డిస్కవర్ 100 సీసీ తేవడమే బజాజ్ చరిత్రలో అతిపెద్ద తప్పిదం!
- డిస్కవర్ 125 సీసీ బైక్ కు మంచి మద్దతు
- 100 సీసీ కావాలని కోరిన మార్కెట్ వర్గాలు
- తయారు చేసి నష్టపోయామన్న రాజీవ్ బజాజ్
భారత వాహన మార్కెట్లో ఫెయిల్యూర్ మోడల్ గా ముద్రపడిన బజాజ్ డిస్కవర్ 100 సీసీ బైక్ పై సంస్థ ఎండీ రాజీవ్ బజాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన వృత్తి జీవితంలో ఈ బైక్ ను తేవడమే అతిపెద్ద తప్పని ఆయన అన్నారు. ఇదే బైక్ ను 125 సీసీలో విడుదల చేయగా చాలా మంచి స్పందన వచ్చిందని, ఆ సమయంలో 100 సీసీ బైక్ వస్తే, విక్రయాలు ఇంకా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెప్పడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన గుర్తు చేసుకున్నారు. 100 సీసీ డిస్కవర్ బైక్ ను తెచ్చిన కారణంగానే భారత మార్కెట్లో బజాజ్ రెండో స్థానంలో ఉండిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ బైక్ కారణంగా గడచిన ఐదేళ్లలో తమ స్థానాన్ని, పనితీరును నష్టపోయామని అన్నారు. కేటీఎం విషయంలో మాత్రం విజయం సాధించామని, ఈ సంవత్సరం హార్లే డేవిడ్ సన్ బైక్ లు 2.40 లక్షలుకాగా, కేటీఎం అమ్మకాలు 2.7 లక్షల యూనిట్లను దాటాయని రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. వచ్చే సంవత్సరంలో తాము బ్యాటరీతో నడిచే వాహనాలను ఉత్పత్తి చేస్తామని ఆయన తెలిపారు. ఇ-వాహనాలపై పరిశ్రమ సవతి తల్లి ప్రేమను చూపుతోందని చెప్పిన ఆయన, 2019లో 'టెస్లా' టూ లేదా త్రీ వీలర్ వెహికిల్స్ లోకి వస్తుందని చెప్పారు.