vijaya rangaraju: 'భైరవద్వీపం'లో విలన్ వేషం వేయడానికి ముందుగా నేను ఒప్పుకోలేదు: నటుడు విజయ రంగరాజు
- మాంత్రికుడి వేషం కోసం పిలిపించారు
- నా స్టైల్లో నటించి చూపించాను
- నా నటన నచ్చాకే సైన్ చేశాను
వివిధ భాషల్లో విలన్ పాత్రలను ఎక్కువగా చేసిన విజయరంగరాజు, తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. "మలయాళంలో నేను చేసిన ఒక సినిమా చూసి .. 'భైరవద్వీపం'లో మాంత్రికుడి పాత్రను నాకు ఇవ్వాలని దర్శక నిర్మాతలు భావించారు. నన్ను పిలిపించి మాంత్రికుడి వేషాన్ని నాకు ఇస్తున్నట్టుగా చెప్పి, అగ్రిమెంట్ పై సైన్ చేయమని అన్నారు.
'అసలు ఈ పాత్రకి నేను పనికొస్తానా లేదా అనేది టెస్ట్ చేయండి. ఒకటి రెండు రోజులు షూటింగ్ చేశాక, నన్ను తీసేసి వేరే అతణ్ణి పెడితే నేనేమైపోవాలి. అలా జరిగితే ఇండస్ట్రీలో వుండటమా .. సూసైడ్ చేసుకోవడమా అనే రేంజ్ కి వెళతాను నేను .. అంత సెన్సిటివ్ నేను. అందువలన టెస్ట్ చేసుకోండి .. మీకు నచ్చితే అప్పుడు సైన్ చేస్తాను' అని చెప్పాను. అప్పుడు వాళ్లు సినిమాకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ ఇచ్చారు. ఆ డైలాగ్స్ నేను నా స్టైల్లో చెప్పడంతో 'భైరవుడు' పాత్రకి నన్ను ఓకే చేశారు" అని చెప్పుకొచ్చారు.