Revanth Reddy: ఓట్లు అడగడానికి సోనియాగాంధీ తెలంగాణకు రావడం లేదు: రేవంత్ రెడ్డి
- తెలంగాణ ప్రజల ఆవేదనను చూసి తెలంగాణను సోనియా ఇచ్చారు
- నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారు
- మనలో విశ్వాసం కల్పించడానికే సోనియా తెలంగాణకు వస్తున్నారు
యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ఓట్లు అడగడానికి ఇక్కడకు రావడం లేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆవేదనను చూసి రాష్ట్రాన్ని సోనియా ఇస్తే... నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేశారని మండిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ దివాళా తీయించిన పరిస్థితులను చెప్పడానికి, ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు భరోసా ఇవ్వడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడానికి, ఉద్యమకారులను కేసుల నుంచి విముక్తి కల్పించడానికి, అందరికీ కాంగ్రెస్ అండగా ఉంటుందని మనలో విశ్వాసం కల్పించడానికే సోనియా ఈరోజు తెలంగాణలో అడుగుపెడుతున్నారని చెప్పారు.
తనను ఓడిస్తే ఫాంహౌస్ లో పడుకుంటానని కేసీఆర్ అంటున్నారని, అమెరికా పారిపోతానని కేటీఆర్ అంటున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ప్రజలకు అన్ని సమయాల్లో అండగా ఉండేది ఎవరో ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పారు. అనేక పథకాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని, ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ అన్నింటినీ విస్మరించారని చెప్పారు. ఇదే సమయంలో సోనియాగాంధీ వేదికపైకి రావడంతో... రేవంత్ తన ప్రసంగాన్ని ముగించారు.