Sonia Gandhi: అదే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో టీఆర్ఎస్ ను చిత్తుగా ఓడించండి: సోనియాగాంధీ
- తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నాశనం చేశారు
- కేసీఆర్, ఆయన కుటుంబం, బంధుమిత్రులు మాత్రమే బాగుపడ్డారు
- ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయారు
ప్రతి తల్లి కూడా తన బిడ్డలు బాగుండాలని కోరుకుంటుందని... కానీ తెలంగాణ ప్రజల బతుకులు చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోందని సోనియాగాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలకు విఘాతం కలిగిందని చెప్పారు. తెలంగాణ ఎందుకు కావాలని మీరు కోరుకున్నారో... మీ కలల్లో ఏ ఒక్కటి కూడా వాస్తవరూపం దాల్చలేదని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు ఏ ఒక్కటీ నెరవేరలేదని విమర్శించారు. వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని అన్నారు. తాము తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి, రైతులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన లేకపోవడంతో... తెలంగాణ యువత తీవ్ర నిరాశలో కూరుకుపోయిందని అన్నారు.
గతంలో తెలంగాణలోని మహిళల స్వయం సహాయక బృందాల అభివృద్ధిని చూసి ఎంతో సంతోషించానని... ఇతర రాష్ట్రాలలో కూడా ఇక్కడి మహిళల ఘనత గురించి చెప్పేదాన్నని సోనియా తెలిపారు. కానీ, టీఆర్ఎస్ పాలనలో అదంతా నాశనమయిందని దుయ్యబట్టారు. దళితులు, ఆదివాసీలకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేకపోయారని మండిపడ్డారు. కేసీఆర్, ఆయన కుటుంబం, ఆయన బంధుమిత్రులు మాత్రమే తెలంగాణలో బాగుపడ్డారని అన్నారు.
మాట మీద నిలబడని వాళ్లను, విశ్వసనీయత లేని వ్యక్తులను నమ్మవద్దని సోనియా చెప్పారు. పెంపకంలో లోపం ఉంటే పిల్లవాడి భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో... అదే విధంగా నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం నాశనం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనవని... మీ భవిష్యత్తు కోసం మహాకూటమికి ఓటు వేయాలని కోరారు. ప్రజల కోసం ఏమేం చేయబోతున్నామో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా పోరాడారో... టీఆర్ఎస్ ను ఓడించేందుకు కూడా అదే స్ఫూర్తితో పని చేయాలని కోరారు. మహాకూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలని యావత్ తెలంగాణ సమాజాన్ని కోరుతున్నానని విన్నవించారు. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.