TRS: టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుపై చెప్పులు, రాళ్లు విసిరిన గ్రామస్తులు
- ఈ నాలుగేళ్లలో ఏం చేశారు?
- ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చారు?
- నిలదీసి చెప్పులు విసిరిన లంబాడాలు
ప్రచారం కోసం గ్రామాల్లోకి వచ్చిన నేతలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్న ఘటనలు రోజూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, టీఆర్ఎస్ అశ్వారావుపేట అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుకు అటువంటి అనుభవమే ఎదురైంది. తమ గ్రామానికి వచ్చిన ఆయనను చూడగానే గ్రామస్థులు చెప్పులు, రాళ్లతో ఆయనకు స్వాగతం పలికారు. ఆయనపై రాళ్లు రువ్వారు. చెప్పులు విసిరారు. భద్రాద్రి జిల్లా చంద్రుగొండ మండలంలోని పోకలగూడెంలో జరిగిందీ ఘటన.
వెంకటేశ్వర్లు శుక్రవారం శ్రీరాంపురం, రేపల్లెవాడ గ్రామాల మీదుగా అన్నారం తండా, గానుగపాడు నుంచి పోకలగూడేనికి చేరుకున్నారు. గ్రామానికి ఆయన చేరుకోగానే స్థానికులు పెద్ద ఎత్తున ఆయనను చుట్టుముట్టారు. లంబాడాలకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారంటూ నిలదీశారు. తమ గ్రామానికి ఈ నాలుగేళ్లలో ఏం చేశారని మళ్లీ ఓట్లు అడిగేందుకు వచ్చారని నిలదీశారు. ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ చెప్పులు, రాళ్లు విసిరారు. అయితే, పోలీసులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో ఆయన వెనుదిరిగారు.