Visakhapatnam District: సింహాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఆత్మహత్య.. ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు, ఉద్యోగులు!
- డిపోలో విషం తాగిన చింతా నాగేశ్వరరావు
- డీఎం దివ్య వేధిస్తున్నారని సూసైడ్ నోట్
- మృతుడి కుమారుడికి ఉద్యోగం ఇస్తామని హామీ
విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆర్టీసీ డిపోలో డ్రైవర్ చింతా నాగేశ్వరరావు నిన్న విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఓ యాక్సిడెంట్ విషయంలో డిపో మేనేజర్ దివ్య వేధించడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా సింహాచలం ప్రాంతంలో కలకలం చెలరేగింది. తమ సహచరుడి మృతిని తట్టుకోలేని తోటి ఆర్టీసీ ఉద్యోగులతో పాటు కుటుంబ సభ్యులు సింహాచలం ఆర్టీసీ డిపో ముందు ఈ రోజు ఆందోళనకు దిగారు.
డిపో నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రీజినల్ మేనేజర్ బాధిత కుటుంబంతో పాటు ఆర్టీసీ కార్మికులతో చర్చలు ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాగేశ్వరరావు 1991 నుంచి ఇక్కడ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని తెలిపారు. నాగేశ్వరరావు మరణం నేపథ్యంలో ఆయన కుమారుడికి తొలుత ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగం ఇస్తామని అన్నారు.
అనంతరం ఆ యువకుడి సర్వీసును క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అయితే నాగేశ్వరరావు కుటుంబానికి పరిహారం చెల్లింపు తన పరిధిలో లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ హామీలను లిఖిత పూర్వకంగా ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు.