Jagan: జగన్ నా మిత్రుడు.. అందుకే కోడికత్తి దాడి తర్వాత స్పందించా!: మంత్రి కేటీఆర్
- దానిపైనా చంద్రబాబు అభాండాలు వేశారు
- నాకంటే గంట ముందే లోకేశ్ ట్వీట్ చేశారు
- ఆయన కూడా మాతో కలిసిపోయారా?
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగినప్పుడు తాను సిరిసిల్లలో ఎన్నికల ప్రచారంలో ఉన్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు. జగన్ పై దాడి ఘటన ఫొటోలను తన పీఏ తీసుకొచ్చి చూపారన్నారు. ఈ నేపథ్యంలో జగన్ కోలుకోవాలనీ, ఇలాంటి దాడులను ఖండిస్తున్నానని తాను పోస్ట్ పెట్టినట్లు కేటీఆర్ అన్నారు. మనిషన్న వాడు ఎవడైనా ఇలాంటి దాడుల సమయంలో సానుభూతి తెలుపుతారన్నారు. జగన్ తనకు తెలిసిన వ్యక్తనీ, మిత్రుడనీ, అందువల్లే తాను ట్విట్టర్ లో స్పందించానని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
అయితే ఈ ట్వీట్ ను కూడా చంద్రబాబు రాజకీయంగా రాద్ధాంతం చేశారని కేటీఆర్ విమర్శించారు. ‘కేసీఆర్, కేటీఆర్, పవన్ కల్యాణ్, మోదీ కలిసి నాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు’ అంటూ చంద్రబాబు ఆరోపించారని గుర్తుచేశారు. తాను అక్టోబర్ 25న మధ్యాహ్నం 3.38 గంటలకు ట్వీట్ చేస్తే చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేశ్ మధ్యాహ్నం 2.30 గంటలకే జగన్ పై దాడిని ఖండించారని తెలిపారు. దీనర్థం చంద్రబాబు గారి కుమారుడు లోకేశ్ కూడా మాతో కలిసిపోయారా? అని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ నల్గొండలో రోడ్డు ప్రమాదంలో చనిపోగానే మంత్రి జగదీశ్ రెడ్డి దగ్గరుండి అన్ని కార్యక్రమాలను చూసుకున్నారని గుర్తుచేశారు. హరికృష్ణ అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించామని తెలిపారు. ఈ రెండు ఘటనల్లో వ్యక్తుల కులం, మతం గురించి తాము పట్టించుకోలేదనీ, మానవత్వంతో స్పందించామని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి ఆశించి హరికృష్ణ అంత్యక్రియల ఏర్పాట్లు చేయలేదని తేల్చిచెప్పారు.