Rajasthan: ప్రధాని మోదీ తండ్రి పేరేమిటో దేశంలో ఎవరికీ తెలియదు!: కాంగ్రెస్ నేత విలాస్ రావ్ షాకింగ్ కామెంట్స్
- రాహుల్ కుటుంబం గురించి దేశానికి తెలుసు
- కాంగ్రెస్ లో ఐదు తరాలు ప్రజలకు సుపరిచితమే
- రాజస్తాన్ లో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన నేత
రాజస్తాన్ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి విలాస్ రావ్ ముత్తంవర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా వ్యక్తిగత విమర్శలకు దిగారు. మోదీ తండ్రి పేరేమిటో దేశంలో ఎవ్వరికీ తెలియదని వ్యాఖ్యానించారు. రాజస్తాన్ లో జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై అధికార బీజేపీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడింది.
రాజస్తాన్ లో జరిగిన ఓ సభలో ముత్తంవర్ మాట్లాడుతూ..‘ప్రధాని కాకముందు మీ (మోదీ) గురించి దేశంలో ఎవరికి తెలుసు? ఈ రోజు కూడా దేశంలో ఎవ్వరికీ మీ తండ్రి పేరు తెలియదు. కానీ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ అనీ, ఆయన తల్లి ఇందిర అనీ ప్రజలకు తెలుసు. ఇందిరా గాంధీ తండ్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని ప్రజలకు తెలుసు. ఆయన మోతీలాల్ నెహ్రూ కుమారుడని దేశంలోని అందరికీ తెలుసు. రాహుల్ కుటుంబంలో ఐదు తరాలు దేశానికి సుపరిచితమే. కానీ మోదీ తండ్రి పేరు మాత్రం దేశంలో ఎవ్వరికీ తెలియదు. అలాంటి మోదీ ఇప్పుడు లెక్కలు అడుగుతున్నారు’ అని విమర్శించారు.
కాగా, విలాస్ రావ్ ముత్తంవర్ ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని బీజేపీ వ్యాఖ్యానించింది. మరోవైపు ఈ వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా వ్యంగ్యంగా స్పందించారు. రాజ్ బబ్బర్, విలాస్ రావ్ వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో బీజేపీ స్లీపర్ సెల్స్ ఉన్నారన్న అనుమానం కలుగుతోందని చెప్పారు. ఎన్నికలు వచ్చేవరకూ మౌనంగా ఉంటున్న నేతలు తీరా ఎన్నికల సమయానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూరుస్తున్నారని తెలిపారు.