26/11: మరోసారి అలాంటి దాడి జరిగితే.. భారత్-పాకిస్థాన్ ల మధ్య యుద్ధం తప్పదు: అమెరికా సీఐఏ మాజీ అధికారి

  • 26/11 దాడి బాధితులకు ఇంకా న్యాయం జరగలేదు
  • హఫీజ్ సయీద్ పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు
  • పాక్ లో ఆయనకు శిక్ష పడటం అసంభవంలా కనిపిస్తోంది

ముంబైలో జరిగిన 26/11లాంటి ఉగ్రదాడికి పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి పాల్పడితే భారత్-పాక్ ల మధ్య యుద్ధం తప్పదని అమెరికా అధికారులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 26/11 ఉగ్రదాడి జరిగి రేపటితో పదేళ్లు పూర్తవుతోంది. 10 మంది ఉగ్రవాదులు ఆ దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పలువురు అమెరికన్లు కూడా ఉన్నారు. దాడికి పాల్పడిన తొమ్మిది మంది ఉగ్రవాదులను భద్రతాదళాలు కాల్చి చంపగా, కసబ్ ను ఉరితీశారు. అయితే, ఆ దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ మాత్రం పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.

ఈ సందర్భంగా సీఐఏ మాజీ అధికారి బ్రూస్ రైడెల్ మాట్లాడుతూ, 26/11 దాడుల బాధితులకు ఇంకా పూర్తి న్యాయం జరగలేదని చెప్పారు. ఉగ్రదాడి సూత్రధారి ఇంకా స్వేచ్ఛగానే తిరుగుతున్నాడని... పాకిస్థాన్ లో అతనికి శిక్ష పడటం అసంభవంలా కనిపిస్తోందని అన్నారు. ఇలాంటి దాడి మరొకసారి జరిగితే... అది భారత్-పాకిస్థాన్ ల మధ్య యుద్ధానికి దారి తీస్తుందని చెప్పారు.

ఇదే అంశంపై పాకిస్థాన్ లో అమెరికా దౌత్యవేత్తగా పని చేసిన హుస్సేన్ హక్వానీ మాట్లాడుతూ, ఇలాంటి భీకర దాడికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరోసారి పాల్పడితే... జరగబోయే పరిణామాలను ఎవరూ అంచనా కూడా వేయలేరని అన్నారు. 2008లో పాకిస్థాన్ ఇచ్చిన హామీ మేరకు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండగలిగాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి కూడా తన వంతు పాత్రను పోషించిందని తెలిపారు. 

  • Loading...

More Telugu News