spit: కోల్ కతాలో ఎక్కడపడితే అక్కడ ఉమ్మితే ఇక లక్ష రూపాయల జరిమానా!
- రోడ్లపై ఉమ్మివేసే వారిపై ఉక్కుపాదం
- గరిష్టంగా రూ. లక్ష వరకు జరిమానా
- 11 మంది సభ్యులతో కమిటీ వేసిన ప్రభుత్వం
పశ్చిమబెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. కోల్ కతాలో ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేస్తే ఏకంగా లక్ష రూపాయల జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేసింది. నగరంలోని పర్యాటక ప్రదేశాలు, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పాన్ మరకలు, ఉమ్మి అసహ్యంగా కనబడుతున్నాయి.
ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా, ఉమ్మినా కనిష్టంగా రూ. 50, గరిష్టంగా రూ. 5 వేల జరిమానా విధిస్తున్నారు. అయితే, ఈ జరిమానాలతో పెద్దగా మార్పు రాకపోవడంతో... జరిమానాను గరిష్టంగా రూ. లక్షకు పెంచారు. దీని కోసం అసెంబ్లీలో బిల్లును కూడా ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఆదేశాల అమలు కోసం 11 మంది సభ్యులతో కూడిన కమిటీని కూడా వేశారు.
మహారాష్ట్రలోని పూణేలో కూడా ఉమ్మివేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జరిమానా విధించడంతో పాటు, ఉమ్మివేసిన వారితోనే దాన్ని కడిగిస్తున్నారు. ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.