Telangana: హెచ్ఎండీఏకు నష్టం తెచ్చిన టీఆర్ఎస్ కొంగరకలాన్ సభ!
- సెప్టెంబరు 2న కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ సభ
- టోల్ వసూళ్లు నిలిపివేసిన హెచ్ఎండీఏ
- రూ. 87 లక్షలకు ఇచ్చింది రూ.59 లక్షలే
టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కొంగర కలాన్ సభ హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)కు తీరని నష్టం మిగిల్చింది. సెప్టెంబరు 2న కొంగర కలాన్‌లో టీఆర్ఎస్ ‘ప్రగతి నివేదన సభ’నిర్వహించింది. సభా స్థలం పక్కనే ఔటర్ రింగ్ రోడ్డు ఉండడంతో సభ నిర్వహణకు టీఆర్ఎస్ హెచ్ఎండీఏ అనుమతి కోరింది. అంతేకాక, ఆరోజు టోల్ వసూళ్లను నిలిపివేయాలని కోరింది.
అయితే, టోల్ వసూళ్ల ద్వారా రోజుకు రూ. 87 లక్షల ఆదాయం వస్తోందని, దానిని భరిస్తే సభకు అనుమతి ఇస్తామని హెచ్ఎండీఏ తేల్చి చెప్పింది. సరేనన్న టీఆర్ఎస్ ఆ రోజు టోల్ వసూళ్లు నిలిపివేయాలని కోరింది. అయితే ఒప్పందం ప్రకారం హెచ్ఎండీఏకు టీఆర్ఎస్ ఆ మొత్తాన్ని చెల్లించిందా? అంటూ సీపీఎం గ్రేటర్ కార్యదర్శి శ్రీనివాస్ సమాచార హక్కు చట్టం కింద హెచ్ఎండీఏను కోరారు.
దీనికి బదులిచ్చిన హెచ్ఎండీఏ రూ. 59.83 లక్షలు మాత్రమే చెల్లించినట్టు తెలిపింది. అంటే రూ. 27.17 లక్షలను హెచ్ఎండీఏ నష్టపోయిందన్నమాట.