Rahul Gandhi: రాహుల్ గాంధీని ఎద్దేవా చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి
- రాహుల్ పార్ట్ టైం లీడర్
- ఆయన విదేశాల్లోనే ఎక్కువ సమయం ఉంటారు
- ప్రజా సమస్యలు ఆయనకు తెలియవు
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ సెటైర్లు వేశారు. ఆయనో పార్ట్ టైం లీడరని, ప్రజా సమస్యలపై ఆయనకు ఏ కోశానా అవగాహన లేదని ఎద్దేవా చేశారు. స్వదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువగా ఉండేందుకు ఆయన ఇష్టపడతారని పేర్కొన్నారు. రాహుల్ రాజకీయ లబ్ధి కోసమే ఎన్నికల సభలు నిర్వహిస్తుంటారని విమర్శించారు. ఈ నెల 28న మధ్యప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సియోనీ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఫడ్నవిస్ మాట్లాడుతూ రాహుల్‌పై విమర్శల వర్షం కురిపించారు.
మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలోని సమస్యలు రాహుల్ గాంధీకి తెలియవన్నారు. స్వదేశానికి వచ్చినప్పుడు రెండు మూడు సభలు నిర్వహించి వెళ్లిపోతారని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే ఆయన కనిపిస్తారన్నారు. అధికారం కోసం ఆచరణ సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ప్రజల మద్దతు ఉండడం వల్లే ఆయన గత 15 ఏళ్లుగా సీఎంగా కొనసాగుతున్నారన్నారు. అర శతాబ్దంపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పేదరికాన్ని మరింత పెంచిందని ఫడ్నవిస్ ఆరోపించారు.