Telangana: ‘లోక్ సత్తాలో చేరబోతున్నారు’ అనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ!
- ప్రజా మేనిఫెస్టోను మేమే రూపొందించాం
- ఇప్పుడు ప్రజలు నేతలను నిలదీస్తున్నారు
- ఆప్, టీపీపీ నుంచి ఆహ్వానాలు వచ్చాయి
తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలపై పీపుల్స్ మేనిఫెస్టో పేరుతో తాము ఓ ఉద్యమాన్ని ప్రారంభించామని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణలోని చాలా నియోజకవర్గాల్లో తాను పర్యటించానన్నారు. తాను ప్రారంభించిన ఉద్యమం ఇప్పుడు సానుకూల ఫలితాలను చూపుతోందని, తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో ప్రజలు నేతలను నిలదీస్తున్నారని పేర్కొన్నారు. ‘మా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వండి’ అంటూ స్టాంప్ పేపర్లపై నేతలతో సంతకం తీసుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ లో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడారు.
ప్రజలకు మరింత సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రావాలని తాను నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం తమ విధివిధానాలను గతంలో తిరుపతిలో జరిగిన సభలో ప్రకటించామన్నారు. ప్రధానంగా వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఉపాధి కల్పన, సమసమాజ నిర్మాణం, మహిళా సాధికారత, యువతలో చైతన్యం, జీరో బడ్జెట్ రాజకీయాలను తమ విధివిధానాలుగా నిర్ణయించామన్నారు.
ఇక లోక్ సత్తా పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆ పార్టీ వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ తనను కోరారని లక్ష్మీనారాయణ తెలిపారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్(టీపీపీ)లో చేరాల్సిందిగా తనకు ఆహ్వానాలు అందాయని పేర్కొన్నారు. వీటిపై మద్దతుదారులు, అనుచరులతో చర్చించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.