Pawan Kalyan: తెలంగాణలో ఆ రైతు పెట్టుకున్న కన్నీరు నాకు ఇంకా గుర్తుంది!: పవన్ కల్యాణ్
- పచ్చదనం అంటే నాకు చాలా ఇష్టం
- కానీ ఇప్పుడు పర్యావరణ విధ్వంసం జరుగుతోంది
- రైతులతో జనసేనాని ముఖాముఖి
చిన్నప్పటి నుంచి పచ్చని చెట్లు అంటే తనకు చాలా ఇష్టమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఓసారి తమ ఇంటి దగ్గర మామిడి చెట్టును కొట్టివేస్తే తనకు చాలా ఏడుపు వచ్చిందని తెలిపారు. మళ్లీ ఆ చెట్టు ఎప్పుడు పెరిగి పచ్చగా మారుతుందో అని అప్పట్లో బాధపడ్డానని గుర్తుచేసుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆధునికీకరణ పేరుతో దేశమంతా విధ్వంసకరమైన ప్రగతి సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పోరాట యాత్రలో భాగంగా జనసేనాని ఈ రోజు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పంటకు మద్దతు ధర, ఎరువులు, మార్కెట్ సౌకర్యాలు, దళారుల వ్యవస్థ, గిడ్డంగుల వసతి తదితర అంశాలపై రైతన్నల సమస్యలను పవన్ సానుకూలంగా విన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. జనసేన పార్టీని 2014లో ప్రజల ముందుకు తీసుకురావడం చాలా సాహసోపేతమైన చర్య అని అభిప్రాయపడ్డారు. కానీ ప్రజలకు సేవ చేసేందుకు, ధర్మపోరాటం కోసం పార్టీని స్థాపించానన్నారు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక సెజ్ ల పేరుతో ఏటా 3 పంటలు పండే భూమిని లాక్కుని రైతులను రోడ్డుపై పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాలు రైతులను ఎందుకు రక్షించడం లేదని తన మనసులో ప్రశ్నలు ఉదయించేవని చెప్పారు. 2006-07లో తెలంగాణలో ఓ రైతన్న పెట్టిన కన్నీరు తనకు ఇంకా గుర్తుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఊర్ల కోసం రోడ్లు వేయడం చూశాం. కానీ రోడ్ల కోసం ఊర్లను తొలగించడం చూడలేదు’ అంటూ ఆ రైతన్న సెజ్ విషయంలో కన్నీరు పెట్టాడని పవన్ గుర్తు చేసుకున్నారు. రైతులు దేవుడికి ప్రతిరూపమనీ, అలాంటి వారిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్యానించారు. రైతులపై కాల్పులు, మద్దతు ధర లేకపోవడంతో ఆత్మహత్యలతో రైతుల పరిస్థితి దారుణంగా తయారయిందని ఆవేదన వ్యక్తం చేశారు.