ramgopal varma: ఓ పేద కుర్రాడి ప్రేమకథే 'భైరవగీత': రామ్ గోపాల్ వర్మ
- ప్రేమ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది
- పాత్రలు మాత్రమే తెరపై కనిపిస్తాయి
- అందుకే కొత్తవాళ్లను తీసుకున్నాము
రామ్ గోపాల్ వర్మ తన సినిమాను మొదలుపెట్టిన దగ్గర నుంచి అది థియేటర్లలోకి వచ్చేంత వరకూ ఆ సినిమాను గురించే అంతా మాట్లాడుకునేలా చేస్తారు. అంతగా ఆయన తన సినిమా ప్రమోషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ సారి ఆయన దర్శకుడిగా కాకుండా నిర్మాతగా ఒక వైవిధ్యభరితమైన సినిమా చేశారు .. దాని పేరే 'భైరవగీత'. సిద్ధార్థ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ .. " ఒక డబ్బున్న అమ్మాయికి .. ఒక పేద కుర్రాడికి మధ్య జరిగే ప్రేమకథే 'భైరవగీత'. ఆ ఇద్దరి ప్రేమ చుట్టూనే కథ తిరుగుతుంది. ఈ సినిమా కథను సిద్ధార్థ చెప్పినప్పుడు నాకు ఎంత కొత్తగా అనిపించిందో, సినిమా చూస్తున్నప్పుడు మీకు కూడా అలాంటి ఫీలింగే కలుగుతుంది. కథ సహజత్వానికి దగ్గరగా ఉండాలనీ, పాత్రలు మాత్రమే తెరపై కనిపించాలని కొత్త నటీనటులను తీసుకున్నాము" అని చెప్పుకొచ్చారు.