Cold: ఏపీ మన్యంలో 3.2 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు!
- మన్యం ప్రాంతాన్ని వణికిస్తున్న చలిపులి
- లంబసింగిలో 3.2 డిగ్రీలు మాత్రమే
- మరింతగా పడిపోతుందని అధికారుల అంచనా
ఉత్తరాంధ్ర కశ్మీరంగా పేరున్న మన్యంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. విశాఖ మన్యం మొత్తాన్ని చలి వణికిస్తుండగా, లంబసింగి ప్రాంతంలో అత్యంత కనిష్ఠంగా 3.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న చింతపల్లి పరిశోధనా కేంద్రంలో 5.2 డిగ్రీలకు ఉష్ణోగ్రత పడిపోయిందని వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు.
గత నెలలోనే రెండు సార్లు 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, గత శనివారం నాడు 7.5 డిగ్రీలు, ఆదివారం నాడు 6 డిగ్రీలకు తగ్గిన ఉష్ణోగ్రత, సోమవారం ఇంకా పడిపోయిందని చెప్పారు. డిసెంబర్ మొదటి వారాల్లో ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అంచనా వేశారు. కాగా, చలి తీవ్రత అధికం కావడంతో పర్యాటకుల సంఖ్య పెరుగగా, పాఠశాల విద్యార్థులు, రోజువారీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.