Helecopters: హెలికాప్టర్ల వినియోగంలో టీఆర్ఎస్ కన్నా ముందున్న కాంగ్రెస్!
- హెలికాప్టర్లలో చుట్టి వస్తున్న ప్రధాన నేతలు
- కాంగ్రెస్ 3, టీఆర్ఎస్ 2, బీజేపీ 1 హెలికాప్టర్ వాడకం
- రెట్టింపు డబ్బు వసూలు చేస్తున్న ఏవియేషన్ సంస్థలు
తెలంగాణకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో వేగంగా నియోజకవర్గాలను చుట్టి, ప్రచారం నిర్వహించాలన్న ఉద్దేశంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు, హెలికాప్టర్లను ఆశ్రయించాయి. ఈ విషయంలో టీఆర్ఎస్ తో పోలిస్తే, కాంగ్రెస్ పార్టీ ముందు నిలిచింది. టీఆర్ఎస్ పార్టీ రెండు హెలికాప్టర్లను మాత్రమే వాడుతోంది. వాటిల్లో ఒకటి కేసీఆర్ కోసం, మరొకటి కేటీఆర్, హరీశ్ రావు తదితరుల కోసం వాడుతున్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీ 3 హెలికాప్టర్లను వినియోగిస్తోంది. ఒకటి స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి పర్యటనల నిమిత్తం వినియోగిస్తుండగా, మిగతా రెండింటినీ, ఎవరికి అవసరమైతే వారు వాడుతున్నారు. వీటిల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి తదితర నేతలు అసెంబ్లీ సెగ్మెంట్లను చుట్టి వస్తున్నారు. బీజేపీ సైతం ఒక హెలికాప్టర్ ను ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం వాడుతోంది.
ఇక ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంటలోపే చేరుకునే సౌలభ్యం ఉండటంతో నాయకులంతా హెలికాప్టర్లను వాడుతున్నారు. ప్రైవేటు ఎయిర్ లైన్స్ సంస్థలైన హెలిగో, ఓఎస్ఎస్, తుంబి ఏవియేషన్ తదితర కంపెనీలు ఈ సేవలను అందిస్తున్నాయి.
ఇక ఎన్నికల ముందు వరకూ హెలికాప్టర్ ప్రయాణానికి గంటకు రూ. 2 లక్షల వరకూ అద్దె ఉండగా, ఇప్పుడు డిమాండ్ పెరగడంతో రూ. 4 లక్షల వరకూ ఎయిర్ లైన్స్ కంపెనీలు వసూలు చేస్తున్నాయి. దీని ప్రకారం, ఒక్కో పార్టీ రోజుకు ఐదు నుంచి ఆరు గంటల పాటు చాపర్ ను వాడుకుంటే రూ. 20 లక్షలకు పైగానే చెల్లించాల్సి వస్తోంది. ఈ డబ్బును ఆయా నియోజకవర్గాల్లో పోటీకి దిగుతున్న అభ్యర్థుల ఖర్చులో లెక్క చూపిస్తున్నాయి రాజకీయ పార్టీలు.