Nizamabad District: కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం ఒకందుకు మంచిదే... పీడా పోతుంది: నరేంద్ర మోదీ
- హామీలు నెరవేర్చని ప్రభుత్వాన్ని తరిమికొట్టండి
- కొన్ని నెలల ముందే ప్రజలకు అవకాశం వచ్చింది
- తీవ్ర అభద్రతా భావంలో ఉన్న కేసీఆర్
- మోదీ కేర్ ను అంగీకరించలేదని విమర్శలు
ఐదేళ్లు పరిపాలించమని ప్రజలు అవకాశం ఇస్తే, నాలుగున్నరేళ్లకే కేసీఆర్ తన అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వచ్చారని, ఇది కూడా ఒకందుకు మంచిదేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. నిజామాబాద్ సభలో మాట్లాడిన ఆయన, ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వ పీడను వదిలించుకునే అవకాశాన్ని ప్రభుత్వమే స్వయంగా ప్రజలకు దగ్గర చేసిందని అన్నారు. కష్టాల నుంచి గట్టెక్కేందుకు కొన్ని నెలల ముందే ప్రజలకు అవకాశం వచ్చిందని విమర్శలు గుప్పించారు. త్వరలోనే ప్రజలకు టీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి కలుగుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
"నాకు గుర్తుంది. ఈ ప్రాంతంలో ఇంటింటికీ మంచినీరు ఇవ్వలేకుంటే, మరోసారి ఓటు అడిగేందుకు నేను రానని కొందరు చెప్పారు. వాళ్లు ఓటు అడిగేందుకు వచ్చారా? లేదా? అంటే అబద్ధపు హామీలు ఇచ్చినట్టా? ఇవ్వనట్టా? ఇటువంటి నేతలకు ఓట్లు అడిగే హక్కుందా? వారిని తరిమికొట్టాలా? వద్దా?. కనీసం ప్రజలకు మంచినీరు ఇవ్వలేని పాలకులు ఎందుకు? ఇటువంటి వ్యక్తికి ప్రభుత్వ పగ్గాలు ఎందుకు?" అని ప్రశ్నల వర్షం కురిపించారు.
"ప్రభుత్వం పేదల కోసం పనిచేయాలి. ఎవరైనా ధనవంతుడికి అనారోగ్యం వస్తే, పది మంది డాక్టర్లు వస్తారు. ప్రత్యేక విమానాల్లో చికిత్సకు వెళతారు. అదే పేదలైతే ప్రభుత్వ ఆసుపత్రి మినహా మరో మార్గం ఉండదు. ఈ తెలంగాణలో పేదలకు సేవలందించే ఆసుపత్రులు ఎక్కడున్నాయ్? ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడి మెడికల్ కాలేజీలు సరిగ్గా పనిచేయడం లేదు. అక్కడి విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. మామూలు హాస్టల్ లో ఉన్న సౌకర్యాలు కూడా ఇక్కడ లేవు.
ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉన్నారంటే, జ్యోతిష్యం, జాతకాలు, నిమ్మకాయల దండలు, మిరపకాయలపై ఎంతో నమ్ముకున్నారు. దేశంలో 50 కోట్ల మందికి ఆరోగ్య భద్రతను కల్పించే ఆరోగ్య పథకాన్ని పేదలకు అందకుండా చేసిన ఘనత ఈయనది. మోదీ పేరున ఉన్న పథకం అమలైతే తనకు నష్టమన్న భావనలో ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారు. ఆయన అభద్రతా భావంతో ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది" అని నిప్పులు చెరిగారు.