BJP: కేసీఆర్ పాలనలో తెలంగాణ దిగజారింది.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంతకంటే వందరెట్లు ఎక్కువ నష్ట పోతుంది: మోదీ
- నిజామాబాదు సభలో ప్రధాని నరేంద్ర మోదీ
- కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలేనన్న మోదీ
- సోనియా, రాహుల్ కుటుంబ రాజకీయాలు మాట్లాడటం హాస్యాస్పదం
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు నిజామాబాదు సభలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ఇటీవల తెలంగాణలో జరిగిన బహిరంగ సభకు సోనియా గాంధీ, ఆమె సుపుత్రుడు వచ్చి కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ కుటుంబ పార్టీలే అని, వీరిద్దరి మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ నడుస్తోందని ప్రధాని ఆరోపించారు.
కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ మరింత దిగజారిందని స్పష్టం చేసిన మోదీ.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణ ఇంతకంటే వంద రెట్లు ఎక్కువ నష్ట పోతుందని అన్నారు. తెలంగాణ కష్టాలకు కారణమైన కాంగ్రెస్ ను మరోసారి రానివ్వొద్దని ప్రజలను కోరారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంపై పరుగులు పెట్టిస్తానని మోదీ హామీ ఇస్తున్నట్లు తెలిపారు.