Telangana: టీఎస్ ను టీజీగా మారుస్తాం... రాష్ట్ర గీతాన్ని కూడా మార్చేస్తాం: ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్

  • 35 అంశాలతో పీపుల్స్ మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
  • సుపరిపాలనే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించామన్న శ్రవణ్
  • అమరవీరుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సాయం

ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ కాంగ్రెస్ నేడు విడుదల చేసింది. గాంధీభవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాల సమక్షంలో పీపుల్స్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మేనిఫెస్టోకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

దామోదర రాజనర్సింహ నేతృత్వంలో మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాత, విస్తృతమైన చర్చ అనంతరం మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారు. 35 అంశాలతో మేనిఫెస్టోను తయారు చేశామని శ్రవణ్ వెల్లడించారు. 360 డిగ్రీల కవరేజ్ మేనిఫెస్టోలో ఉందని చెప్పారు. సుపరిపాలనే లక్ష్యంగా మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకత లేని పాలన చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ జీవోలన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సీఎం కార్యాలయంలో ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో గ్రివెన్స్ సెల్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 'జయ జయహే తెలంగాణ' అనే పాట ఉద్యమ కాలంలో తెలంగాణను ఉర్రూతలూగించిందని... ఆ పాటను రాష్ట్ర గీతంగా మార్చుతామని చెప్పారు. తెలంగాణ వాహన రిజిస్ట్రేషన్ ను 'టీఎస్' నుంచి 'టీజీ'కి మారుస్తామని తెలిపారు.

అన్ని జిల్లా కేంద్రాలలో అమరవీరుల స్మారకాలను నిర్మిస్తామని దాసోజు పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాల వద్దకే వెళ్లి రూ. 10 లక్షలు అందజేస్తామని చెప్పారు. ఉద్యమకారులపై ఉన్న కేసులన్నింటినీ ఎత్తివేస్తామని తెలిపారు. రూ. 2 లక్షల రైతురుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేస్తామని అన్నారు. రూ. 5 వేల కోట్లతో వ్యవసాయ ఉత్పత్తుల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతుబంధు పథకాన్ని కౌలు రైతులకు, రైతు కూలీలకు కూడా విస్తరిస్తామని తెలిపారు. వ్యవసాయ బడ్జెట్ ను ప్రత్యేకంగా ప్రవేశపెడతామని అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు సామాజిక భద్రతను కల్పిస్తామని చెప్పారు.

నిరుద్యోగులకు నెలకు రూ. 3వేల భృతిని చెల్లిస్తామని శ్రవణ్ తెలిపారు. తొలి ఏడాదిలోనే లక్ష ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ లో 20 శాతాన్ని విద్య కోసం కేటాయిస్తామని తెలిపారు. ఐదేళ్లలో వంద శాతం అక్షరాస్యతను సాధించాలనే లక్ష్యాన్ని మేనిఫెస్టోలో పెట్టుకున్నామని చెప్పారు. ప్రతి ఏడాది రెండు విడతల్లో ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామని చెప్పారు. అన్ని వ్యాధులకు రూ. 5 లక్షల వరకు వైద్యం చేయించుకునేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తామని తెలిపారు. ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి, ప్రతి జిల్లాలో నిమ్స్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు ఒక మెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎర్రగడ్డలో ఉన్న చెస్ట్ ఆసుపత్రిలో 1000 పడకలతో కూడిన మెడికల్ కాలేజీ, ఆసుపత్రిని నిర్మిస్తామని తెలిపారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షలు ఇస్తామని... ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 6 లక్షలు ఇస్తామని శ్రవణ్ చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పాత బకాయిలన్నీ చెల్లిస్తామని తెలిపారు. ఇళ్ల నిర్మాణం కోసం సబ్సిడీపై సిమెంట్ ను అందిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇంటికి అదనంగా మరో గది నిర్మించుకునేందుకు రూ. 2 లక్షలు ఇస్తామని అన్నారు. ఎస్పీ వర్గీకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యమాల్లో పాల్గొన్న వారికి కాంట్రాక్టు ఉద్యోగాల్లో ప్రాధాన్యతను ఇస్తామని చెప్పారు.  

  • Loading...

More Telugu News