Yogi adityanath: రామరాజ్యం ఎక్కడుందయ్యా అంటే.. వివరించి చెప్పిన మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్
- యోగి పక్క రాష్ట్రాల్లో తిరుగుతున్నారు
- జైళ్లలో ‘రామరాజ్యం’ తీసుకొచ్చారు
- ‘సబ్కా సాథ్.. సబ్కా వికాశ్’ ఇదే నిదర్శనం
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ మరోమారు విరుచుకుపడ్డారు. రాయ్‌బరేలీ జైలులోని ఖైదీలు మందు తాగి చిందేస్తూ, జైలు నుంచే ఫోన్ చేసి ఓ వ్యాపారిని బెదిరిస్తున్న వీడియో ఒకటి గత రెండు రోజులుగా వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ఆరుగురు జైలు సిబ్బందిపై ప్రభుత్వం వేటేసింది కూడా.
ఈ ఘటనను ఉద్దేశించి అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ.. యూపీలో రామరాజ్యం జైలులో ఉందని ఎద్దేవా చేశారు. ‘‘ముఖ్యమంత్రి (యోగి ఆదిత్యనాథ్) ఇతర రాష్ట్రాల్లో తమ పార్టీ అభ్యర్థులకు స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేస్తుంటే యూపీలో జైళ్లలో రామరాజ్యం వచ్చింది’’ అని ఎద్దేవా చేశారు. ఇటువంటి రామరాజ్యాన్ని ఆయన రాష్ట్రం మొత్తం తీసుకురావాలని యోచిస్తున్నారని, జైళ్లలోని ఖైదీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘సబ్కా సాథ్.. సబ్కా వికాశ్’కు ఇది నిలువెత్తు నిదర్శనమని ఎద్దేవా చేశారు.
యోగి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత నేరగాళ్లు రాష్ట్రం విడిచి పోవాలని, లేదంటే జైలుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారని అఖిలేశ్ గుర్తు చేశారు. అయితే, నేరగాళ్లు రాష్ట్రాన్ని విడిచిపెట్టలేదు సరికదా, హత్యలు, లూటీలు, కిడ్నాపులకు పాల్పడుతున్నారని అఖిలేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. మంత్రులు కూడా అలాగే తయారయ్యారని అఖిలేశ్ ఆరోపించారు.