cyber crime: సైబర్ నేరగాళ్ల కొత్త పంథా: వివరాలు ఇవ్వాలంటూ ఎస్బీఐ చిహ్నంతోనే ఏకంగా మెసేజ్‌లు
- ఖాతాదారుల ఫోన్ నంబర్లు, ఈ మెయిల్స్‌కు సమాచారం
- వివరాలు అప్డేట్ చేయాలంటూ మెసేజ్ లు
- ఎవరైనా పొరపాటున చిక్కారో అకౌంట్ ఖాళీ
సైబర్ నేరగాళ్ల బారి నుంచి తమ ఖాతాదారులను రక్షించుకునేందుకు బ్యాంకులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే అంతకు రెండింతలు అడ్డదారులు వెతుకుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఇప్పటి వరకు ఖాతాదారుల క్రెడిట్, డెబిట్ కార్డు నంబర్ల ఓటీపీలు సేకరించి నగదు కాజేస్తున్న నేరగాళ్లు తాజాగా ఎస్బీఐ చిహ్నం (లోగో)ను వినియోగిస్తూ మెసేజ్‌లు పంపిస్తున్నారు.
ఖాతాదారుల ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్స్‌కు ఎస్బీఐ లోగోతో కూడిన సంక్షిప్త సమాచారం, మెయిల్స్ పంపుతున్నారు. కార్డు వివరాలను అప్ డేట్ చేయాల్సి ఉందంటూ వివరాలు కోరుతున్నారని, ఇటువంటి మెసేజ్‌లకు స్పందించ వద్దని హైదరాబాద్ సైబర్ క్రైం డీసీపీ కె.సి.ఎస్.రఘువీర్ తెలిపారు. అవసరమైతే బ్యాంక్ శాఖకు వెళ్లి ఖాతా సమాచారం తెలుసుకోవాలని సూచించారు. ఇటువంటి మెసేజ్‌ల సాయంతో ఖాతాల్లోని డబ్బు కాజేయాలన్నది మోసగాళ్ల ప్లాన్ అని తెలిపారు.