Goa: నేతల అనంతకోటి ఉపాయాలు... తెలంగాణ యువతకు అందుతున్న నయా తాయిలాలు!
- గోవాకు ట్రిప్పులు, హైదరాబాద్ పబ్బులకు పాస్ లు
- యువతకు దగ్గరయ్యేందుకు అభ్యర్థుల పాట్లు
- కోటి మంది ఓట్లపై కన్నేసిన నేతలు
- మహిళలకు కిరాణా సామాన్లు, ఆరు నెలల కేబుల్ బిల్
- విజయం కోసం కోట్లు ఖర్చు చేస్తున్న అభ్యర్థులు
ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని ప్రాంతాల యువతతో నిత్యమూ టచ్ లో ఉండే నేత. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా, యువతకు వాహనాలు, చేతి ఖర్చులకు డబ్బులిచ్చి గోవా వెళ్లి ఎంజాయ్ చేసి రావాలని చెబుతున్నారు. ఇక ఈయన్ను చూసిన మెదక్ జిల్లాలో ఎప్పుడూ వివాదాల్లో ఉండే మరో నేత, తన నియోజకవర్గంలోని యువతకు దగ్గరయ్యేందుకు గోవా ట్రిప్పులు వేయిస్తున్నారు.
ఇక కరీంనగర్ కు చెందిన మరో నేత, హైదరాబాద్ పబ్బుల్లో పాస్ లు కొని, యువతను వెళ్లి ఆనందించి రావాలని డబ్బిచ్చి పంపుతున్నారు. చాలా ప్రాంతాల్లోని నేతలు, రెస్టారెంట్లు, బార్లతో ఒప్పందాలు కుదుర్చుకుని యువతకు చీటీలు ఇస్తున్నారు. వీటిని తీసుకెళితే, వారు తాగినంత మందు, తిన్నంత తిండి ఉచితం...
ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఉన్న అభ్యర్థులు కొత్తగా ఓటర్లుగా వచ్చి చేరిన 7 లక్షల మంది మద్దతు కోసం వేసిన అనంత కోటి ఉపాయాల్లో ఇవి కొన్ని మాత్రమే. రాష్ట్రంలో యువ ఓటర్లు 40 శాతం ఉండటం, మొత్తంగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న కోటి మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండటంతో, వారి ఓట్ల కోసం నేతలు సరికొత్త ప్రలోభాలు మొదలు పెట్టారు.
యువత ఎటువైపు మొగ్గితే అటు విజయం ఖాయమన్న ధీమాలో ఉన్న నేతలు, వారు డబ్బు తీసుకునేందుకు ఇష్టపడటం లేదని గ్రహించి, గోవా, హైదరాబాద్ ట్రిప్పులు, బార్లు, పబ్బులకు పంపుతున్నారని తెలుస్తోంది. ఇది వర్కవుట్ అయిందని చాలా నియోజకవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టూర్లకు వెళ్లి వచ్చిన వారు, నేతలకు అనుకూలంగా ప్రచారం చేస్తూ, తమ ఇతర మిత్రులను ప్రభావితం చేస్తున్నారు.
అంతేకాదు, కాలేజీ యువతకు క్రికెట్ కిట్లు, ఫోన్ పే, పేటీఎంలలో రూ. 1000 వరకూ పాకెట్ మనీ, స్మార్ట్ ఫోన్ రీచార్జ్ లు చేయిస్తున్నారు. యువత పరిస్థితి ఇలా ఉంటే, 40 ఏళ్లు దాటిన వారిలో మహిళలపైనే నేతలు ప్రత్యేక దృష్టిని సారించారు. రూ. 1000కి పైగా ఉచితంగా కిరాణా సామాన్లు, ఆరు నెలల కేబుల్ బిల్ వంటి తాయిలాలు ప్రకటిస్తున్నారు. పురుషులైతే ఉచితంగా మద్యం మామూలే. ఇలా ఓట్ల కోసం పలు నియోజకవర్గాల్లోని అభ్యర్థులు కోట్లలో ఖర్చు చేస్తున్నట్టు సమాచారం.