MIM: ’కారు‘లో కూర్చోండి...హాయిగా తిరిగి రండి : అసదుద్దీన్ ఒవైసీ చమత్కారం
- టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఓటేయాలంటూ పిలుపు
- లేని మామకంటే గుడ్డిమామే నయం అని వ్యాఖ్య
- టీఆర్‌ఎస్ ముస్లింల కోసం ఎంతో చేసిందని వివరణ
ముస్లింల అభ్యున్నతికి అంతో ఇంతో పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ‘‘కారు’లో కూర్చోండి...హాయిగా తిరిగి రండి’ అంటూ చమత్కారం జోడించి ఓటర్లకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్‌నగర్ డివిజన్ హబీబ్‌ఫాతిమా నగర్, సంజయ్‌నగర్ కూడలిలో మంగళవారం రాత్రి నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే స్టీరింగ్ మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ఎంఐఎం ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోందని, ఆ స్థానాల్లో ఎంఐఎంను, మజ్లిస్ బరిలోలేని చోట టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం 236 మైనార్టీ సంక్షేమ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందని, వీటిలో 50 వేల మంది మైనార్టీ విద్యార్థులు చదువుకుంటున్నారని గుర్తు చేశారు. వీరిలో ఒక్కో విద్యార్థి కోసం ప్రభుత్వం లక్షా 20 వేలు ఖర్చు చేస్తోందని చెప్పారు.
ఈ పరిస్థితుల్లో ‘లేని మామ కంటే గుడ్డి మామ నయం’ అన్న ఉద్దేశంతో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. అందువల్ల ఓటర్లు టీఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించి భాజపా, మహా కూటమికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీరు ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందని ఆరోపించారు.