Vizag: ఏపీలోనూ టీడీపీతో పొత్తు... చాలామంది త్యాగాలు చేయాల్సిందేనని రఘువీరా సంకేతాలు... పలువురిలో ఆందోళన!
- విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాల నేతల సమావేశం
- హాజరైన 36 నియోజకవర్గాల సమన్వయకర్తలు
- సీటు దక్కని వారికి నామినేటెడ్ పదవులన్న రఘువీరా
ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి నుంచి అందిన సంకేతాలు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి. రాష్ట్రంలోనూ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని, పార్టీ బలంగా ఉన్న చోట్ల సీనియర్లకు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని, మిగతావారు త్యాగాలు చేయక తప్పదని ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది.
విశాఖలో నిన్న ఉత్తరాంధ్ర జిల్లాల కాంగ్రెస్ పార్టీ సమావేశానికి 36 నియోజకవర్గాల సమన్వయకర్తలు, నేతలు హాజరుకాగా, రఘువీరా ఈ వ్యాఖ్యలు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే సమయంలో కొందరు నేతలు మాట్లాడుతూ, ఓడిపోవడం కన్నా టీడీపీతో పొత్తు పెట్టుకుని, గెలిచే సీట్లను తీసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఇక పార్టీని నమ్ముకుని ఉన్న వారి సంగతేంటని కొందరు అడుగగా, వారికి నామినేటెడ్ పోస్టులు ఇప్పిద్దామని, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందన్న విషయాన్ని ప్రజలు మరచిపోతున్నారని, ఇటువంటి సమయంలో టీడీపీతో పొత్తు కలిసొస్తుందన్న అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సమావేశానికి హాజరైన నేతలకు ఓ ప్రశ్నావళిని అందించిన రఘువీరా, ఏపీలో టీడీపీతో పొత్తుపై పలు ప్రశ్నలు సంధించి, సమాధానాలు రాబట్టినట్టు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.