Rahul Gandhi: తెలంగాణలో వీస్తున్న గాలి కాంగ్రెస్ గాలి.. కేసీఆర్ ను ఓడించే గాలి: కొడంగల్ లో రాహుల్
- ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు
- 22 లక్షల ఇళ్లను పేదలకు ఇస్తామని చెప్పి.. మోసం చేశారు
- మిషన్ కాకతీయ, భగీరథ పనుల్లో అంతులేని అవినీతి జరిగింది
17,000 కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఏర్పడిందని... రాష్ట్ర బడ్జెట్ రూ. 2 లక్షలు దాటిందని... కానీ, కేసీఆర్ పుణ్యమా అని రాష్ట్రంలోని ప్రతి వ్యక్తిపై రూ. 60 వేల అప్పు మిగిలిందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు వీస్తున్న గాలి కాంగ్రెస్ గాలి అని... కేసీఆర్ ను ఓడించే గాలి అని చెప్పారు.
లక్ష ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన కేసీఆర్... నాలుగున్నరేళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులు, రైతులు, యువతను మోసం చేశారని మండిపడ్డారు. 22 లక్షల ఇళ్లను పేదలకు ఇస్తామని వంచించారని అన్నారు. రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడుతూ, రాహుల్ ఈమేరకు వ్యాఖ్యానించారు.
దళితులకు, గిరిజనులకు భూములు ఇస్తామని చెప్పి... కేసీఆర్ మాట తప్పారని రాహుల్ మండిపడ్డారు. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే... భూములు, ఇళ్లు ఇస్తామని చెప్పారు. ప్రతి కుటుంబంపైనా రూ. 2 లక్షల అప్పు మోపిన కేసీఆర్... తన ఆదాయాన్ని మాత్రం 400 రెట్లు పెంచుకున్నారని విమర్శించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల్లో అంతులేని అవినీతి జరిగిందని అన్నారు. రాష్ట్రంలోని అధికారం మొత్తం ఇప్పుడు ఒక కుటుంబం చేతిలో ఉందని... మహాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని అందరికీ పంచుతామని చెప్పారు.