manda krishna: చంద్రబాబు మాకు న్యాయం చేస్తే... కేసీఆర్ దారుణంగా మోసం చేస్తున్నారు.. సోనియా త్యాగానికి విలువ లేకుండా పోయింది: మంద కృష్ణ
- ఏపీలో నష్టపోతామని తెలిసినా తెలంగాణను సోనియా ఇచ్చారు
- సోనియాకు కృతజ్ఞతలు చెప్పడంలో తెలంగాణ సమాజం విఫలమైంది
- తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే... కేసీఆర్ కుటుంబం ఓడిపోవాలి
తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాలు ఎంత ముఖ్యమో... సోనియాగాంధీ తీసుకున్న సాహసోపేత నిర్ణయం కూడా అంతే ముఖ్యమని ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ అన్నారు. తెలంగాణను ఇచ్చిన సోనియాకు కృతజ్ఞతలు చెప్పడంలో తెలంగాణ ప్రజలమైన మనం విఫలమయ్యామని చెప్పారు. ఏపీలో 175 స్థానాల్లో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని తెలిపారు. కానీ, రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా త్యాగానికి తెలంగాణలో విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తొలిసారి చేసిన పొరపాటును రెండోసారి చేయవద్దని తెలంగాణ సమాజానికి తాను విన్నవిస్తున్నానని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుతో ఎవరైనా బాగుపడ్డారంటే... అది కేసీఆర్ కుటుంబం మాత్రమేనని తెలిపారు. తెలంగాణ పోరాటంలో దళితులు పోషించిన పాత్ర చాలా గొప్పదని... కానీ, అదే దళితులకు కేసీఆర్ నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. దళితుడిని సీఎం చేస్తామని చెప్పిన కేసీఆర్ తానే ముఖ్యమంత్రి అయ్యాడని దుయ్యబట్టారు. దళితులకు భూములు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను పక్కన పెట్టారని... విద్యార్థులు, మహిళలు, రైతులు ఇలా ఎవరి ఆకాంక్షలు నెరవేరలేదని మండిపడ్డారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం తాము పోరాడుతుంటే... తొలుత తమకు న్యాయం చేసింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబేనని మంద కృష్ణ తెలిపారు. కేసీఆర్ మాత్రం తమకు మోసం చేస్తున్నారని విమర్శించారు. మంత్రివర్గంలో మాదిగలకు, మాలలకు స్థానం లేకుండా కేసీఆర్ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు మంత్రివర్గంలో మాలలు, మాదిగలకు న్యాయం జరిగిందని ప్రశంసించారు. పార్లమెంటు తలుపులను మూసి తెలంగాణ బిల్లును పాస్ చేయించిన అప్పటి స్పీకర్ మీరా కుమార్ మహిళ అని... కానీ, కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేదని అన్నారు.
ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం కొనసాగుతోందని... ఇక్కడ మాత్రం లేదని విమర్శించారు. లోటు బడ్జెట్ ఉన్న ఏపీలో చంద్రబాబు ప్రజాపాలన చేస్తున్నారని కితాబిచ్చారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే... కేసీఆర్ కుటుంబం ఓడిపోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాకముందు ఉద్యమం జరుగుతున్న సమయంలో కోదండరామ్ ను ఎప్పుడూ అరెస్ట్ చేయలేదని... కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఇంటిపైకే తెగబడ్డారని మండిపడ్డారు.