Chandrababu: రాహుల్ గాంధీ ముందుకు రావడం సంతోషకరం: చంద్రబాబు
- ఎన్డీయే హయాంలో వ్యవస్థలన్నీ నాశనం అయ్యాయి
- మీడియా కూడా వాస్తవాలను రాయలేని పరిస్థితిని తీసుకొచ్చారు
- దేశాన్ని రక్షించడం కోసమే రాహుల్ తో చేతులు కలిపాం
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో కలసి తెలుగుదేశం పార్టీ వేదికను పంచుకోవడం చారిత్రక ఘట్టమని... దీనికి వేదికగా నిలిచిన ఖమ్మం చరిత్రలో నిలిచిపోతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అప్రజాస్వామిక శక్తులను తరిమి కొట్టేందుకే ప్రజాకూటమి ఏర్పడిందని... తొలి అడుగు ఇక్కడ పడిందని చెప్పారు. దేశంలోని రాజ్యాంగ సంస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐ, గవర్నర్ వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోయాయని అన్నారు.
పెద్ద నోట్ల రద్దుతో ఒనగూరిందేమీ లేదని విమర్శించారు. ఏటీఎంలలో కరెన్సీ కూడా దొరకడం లేదని... దీనికంతా ఎన్డీయే ప్రభుత్వమే కారణమని అన్నారు. రూపాయి విలువ పడిపోయిందని, ధరలు పెరిగి ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ముస్లింలు, దళితులు అభద్రతాభావంలో ఉన్నారని అన్నారు. ఖమ్మం సభలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
వాస్తవాలను మీడియా రాయలేని పరిస్థితిని తీసుకొచ్చారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నేపథ్యంలో కూటమి ఏర్పాటు చేసేందుకు రాహుల్ గాంధీ ముందుకు రావడం సంతోషకర పరిణామమని చెప్పారు. మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ తో విభేదించామని... కానీ దేశాన్ని రక్షించడం కోసం రాహుల్ గాంధీతో చేతులు కలిపామని తెలిపారు. ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు గెలిపించాలన్నారు.