Chandrababu: తెలంగాణ నాకు చాలా ఇష్టమైన ప్రాంతం.. నేనెందుకు వ్యతిరేకంగా ఉంటాను?: చంద్రబాబు
- తెలంగాణ ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు
- తెలంగాణకు వ్యతిరేకమని నేనెప్పుడూ చెప్పలేదు
- తెలంగాణ అభివృద్ధికి నేను అడ్డుపడలేదు
తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ లో ఎవరికీ దక్కని గౌరవం తనకు దక్కిందని... తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న తనను తెలంగాణ ప్రజలు ఎంతో ఆదరించారని చెప్పారు. ఏపీ ఉమ్మడిగా ఉన్నా, విడిపోయినా తెలుగువారంతా సమైక్యంగా ఉండాలని తాను అప్పుడు చెప్పానని, ఇప్పుడు కూడా చెబుతున్నానని తెలిపారు.
న్యాయబద్ధంగా రాష్ట్రాన్ని విడదీయాలని చెప్పానని... తెలంగాణకు తాను వ్యతిరేకమని ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. విభజన హామీలను, ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వలేదని... తెలంగాణలో కూడా ఏ ఒక్క విభజన హామీని నెరవేర్చలేదని అన్నారు. విభజన హామీలపై కేంద్రాన్ని కేసీఆర్ ఒక్కమాట కూడా అడగలేదని విమర్శించారు. ఖమ్మం బహిరంగసభలో ప్రసంగిస్తూ, ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
తెలంగాణలో తానేదో పెత్తనం చేస్తానని అంటున్నారని... తాను ఏపీ ముఖ్యమంత్రినని, తెలంగాణకు అన్ని విధాలా అండగా ఉంటానని చంద్రబాబు అన్నారు. తాను హైదరాబాదు కట్టలేదని... సైబరాబాద్ ను కట్టింది తానేనని చెప్పారు. ఇరు తెలుగు రాష్ట్రాలు బాగుపడాలనేదే తన ఆకాంక్ష అని... ఏనాడూ తెలంగాణ అభివృద్ధికి తాను అడ్డుపడలేదని అన్నారు.