Chandrababu: ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి: చంద్రబాబు
- తెలంగాణలో పలు ప్రాజెక్టులకు నాంది పలికింది నేనే
- టీడీపీ నుంచి వచ్చిన కేసీఆర్.. ఇప్పుడు నన్నే విమర్శిస్తున్నారు
- కింద ఉన్న రాష్ట్రం పైన ఉన్న రాష్ట్రానికి వచ్చే నీటిని ఎలా అడ్డుకుంటుంది?
తెలంగాణకు నీరు రాకుండా తాను అడ్డుపడతానని టీఆర్ఎస్ తనపై విమర్శలు గుప్పిస్తోందని... కింద ఉన్న రాష్ట్రం... పైన ఉన్న రాష్ట్రానికి వచ్చే నీటిని ఎలా అడ్డుకుంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు నాంది పలికింది తానేనని చెప్పారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నీ తన హయాంలోనే వచ్చాయని చెప్పారు. ఖమ్మంలో ఉన్న మమతా మెడికల్ కాలేజీని కూడా తానే ప్రారంభించానని తెలిపారు.
టీడీపీ లేకపోతే కేసీఆర్ ఉండేవారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నుంచి వచ్చి... ఇప్పుడు తననే కేసీఆర్ విమర్శిస్తున్నారని అన్నారు. దేశంలో బీజేపీ కూటమి, బీజేపీ వ్యతిరేక కూటమి మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని... ఈవీఎం మీట నొక్కిన తర్వాత కూడా బ్యాలెట్ స్లిప్పును పరిశీలించాలని సూచించారు.
మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ప్రజాకూటమి అధికారంలోకి రావడం ఖాయమనిపిస్తోందని చెప్పారు. బీజేపీతో ఉంటారా? మహాకూటమి వైపు ఉంటారా అని ఎంఐఎంను ప్రశ్నిస్తున్నానని అన్నారు. 'జై తెలంగాణ' అంటూ ప్రచారాన్ని ముగించారు.