Indonasia: పైలెట్లు ఎంతగానో పోరాడారు: ఇండోనేషియా విమాన దుర్ఘటనకు సంబంధించిన నివేదిక
- ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్ కిందకు తోసింది
- పైలెట్లు మ్యాన్యువల్‌గా ప్రయత్నించారు
- 26 సార్లు విమానాన్ని పైకి తెచ్చే ప్రయత్నం చేశారు
అక్టోబర్ 29న ఇండోనేషియాలో జరిగిన విమాన ప్రమాదంలో 189 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన 13 నిమిషాలకే లయన్ ఎయిర్ జెట్ విమానం జావా సముద్రంలో కుప్పకూలింది. ఈ దుర్ఘటనకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తు నివేదికను బ్లాక్ బాక్స్ డేటా ఆధారంగా అధికారులు నేడు ఆ దేశ పార్లమెంటుకు వెల్లడించారు. ఘటన సమయంలో పైలెట్లు ఎంతగానో పోరాడారని.. కానీ వారి ప్రయత్నం ఫలించలేదని నివేదికలో వెల్లడైంది.
‘‘బోయింగ్ 737 విమానంలోని ఆటోమేటిక్ సేఫ్టీ సిస్టమ్ ఎన్నో సార్లు విమాన ముందుభాగాన్ని కిందకు తోసింది. దీంతో విమానాన్ని పైకి తెచ్చేందుకు పైలెట్లు మ్యాన్యువల్‌గా ప్రయత్నించారు. వారు చేసిన ప్రయత్నం కాసేపే పనిచేసింది. మళ్లీ విమానం కిందకు రావడంతో మరోసారి ప్రయత్నం చేశారు. ఇలా 26 సార్లు విమానాన్ని పైకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ లోపం సరికాలేదు.
సాధారణంగా విమానం ఎగరాల్సిన ఎత్తులో కంటే ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు సెన్సార్స్ గుర్తించి ఆటోమేటిక్ భద్రతా వ్యవస్థకు సమాచారమిస్తాయి. దీంతో వెంటనే అది విమానాన్ని కిందకు దించుతుంది. కానీ ప్రమాదం జరిగిన విమానం తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పటికీ ఇంకా ముందు భాగాన్ని కిందకు తోసింది. ఎన్నిసార్లు పైలెట్లు విమానాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా ఫలితం శూన్యం. అసలు సమస్య ఎక్కడ తలెత్తిందో పైలట్లకు అర్థం కాలేదు. దీంతో ఆటోమేటిక్ సేఫ్టీ వ్యవస్థలోని తప్పుడు యాక్టివేషన్‌ను సరిచేసేందుకు తమకు తెలిసిన ప్రయత్నం చేశారు’’ అని నివేదికలో పేర్కొన్నారు.