Vijayawada: వ్యాపారికి విజయవాడ పోలీసుల వేధింపులు.. ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్ట్!
- బంగారం వ్యాపారిని లంచం కోరిన పోలీసులు
- నగర కమిషనర్ కు బాధితుడి ఫిర్యాదు
- గవర్నర్ పేట సీఐ పవన్ పై వీఆర్ వేటు
బంగారం వ్యాపారిని లంచం కోసం వేధించిన కేసులో ఉన్నతాధికారులు విజయవాడ పోలీసులపై కొరడా ఝుళిపించారు. రూ.5.50 లక్షల లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో కీలకంగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు మల్లెల విష్ణు, రవిని ఈరోజు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ బంగారం వ్యాపారి కొన్ని రోజుల క్రితం సరైన పత్రాలు లేకుండా బంగారాన్ని తీసుకెళుతూ గవర్నర్ పేట పోలీసులకు దొరికిపోయాడు.
దీంతో తమకు రూ.5.5 లక్షల లంచం ఇస్తే కేసు లేకుండా చేస్తామని సీఐ పవన్ కుమార్, కానిస్టేబుళ్లు విష్ణు, రవి చెప్పారు. ఈ వేధింపులు శ్రుతి మించడంతో బాధితుడు విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును ఆశ్రయించాడు. ఈ ఘటనపై సీరియస్ అయిన కమిషనర్ విచారణకు ఆదేశించారు.
ఇందులో సీఐ పవన్ కుమార్ తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు సదరు వ్యాపారిని వేధించారని తేలడంతో కానిస్టేబుళ్లు విష్ణు, రవిలపై కేసు నమోదు చేయాలని చెప్పారు. అనంతరం సీఐని వేకెన్సీ రిజర్వ్(వీఆర్) కు పంపారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇద్దరు కానిస్టేబుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరికాసేపట్లో వీరిని కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించనున్నారు.