Chandrababu: కేసీఆర్ కు ఎంత చెప్పినా వినిపించుకోలేదు: చంద్రబాబు
- కలిసుందామని ఎంతో నచ్చజెప్పాను
- అయినా మోదీతోనే కుమ్మక్కైన కేసీఆర్
- హైదరాబాద్, అమరావతి అన్నదమ్ములు
- ఈ ఉదయం హైదరాబాద్ లో మాట్లాడిన చంద్రబాబు
తెలుగు రాష్ట్రాల్లో స్నేహపూర్వక ప్రభుత్వాలు ఉంటే, జాతి ప్రజలు అభివృద్ధిలో పయనించవచ్చని తాను కేసీఆర్ కు ఎంతో చెప్పానని, కానీ ఆయన మాత్రం తన మాట వినలేదని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలు మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయని తానిచ్చిన సలహాను, మోదీ మాటలను నమ్మి కేసీఆర్ పాటించలేదని ఆరోపించారు. హైదరాబాద్, అమరావతి అన్నదమ్ముల వంటివని, రెండు నగరాలూ మరింతగా అభివృద్ధి చెందాలన్నదే తన అభిమతమని ఆయన అన్నారు.
దేశంలోనే హైదరాబాద్ ఓ ఆణిముత్యం వంటి నగరమని, ఇటువంటి సిటీ మరెక్కడా లేదని చెప్పిన చంద్రబాబు, ఒక్కసారి నరేంద్ర మోదీ అభివృద్ధి చేశానని చెప్పుకునే అహ్మదాబాద్, గాంధీనగర్ లను, తాను డెవలప్ చేసిన హైదరాబాద్, సైబరాబాద్ లను పోల్చి చూడాలని సవాల్ విసిరారు. హైదరాబాద్ కోసం తానెన్నో కలలు కన్నానని, ఇప్పుడూ కంటూనే ఉన్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇప్పుడు అమరావతి గురించి కూడా అటువంటి కలలనే కంటున్నానని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విభజన హామీలపై ప్రధానిని కలసి నిలదీద్దామని తాను ఎన్నిమార్లు చెప్పినా కేసీఆర్ వినలేదని, ఒక్కసారి కూడా తనతో కలసి న్యూఢిల్లీకి రాలేదని చంద్రబాబు ఆరోపించారు.