Andhra Pradesh: హైదరాబాదును , చార్మినార్ ను నేను కట్టలేదు.. కట్టానని ఎప్పుడూ చెప్పుకోలేదు!: చంద్రబాబు
- నేను సైబరాబాద్ ను కట్టాను
- హైదరాబాద్ కు పేరు తీసుకొచ్చాను
- శేరిలింగంపల్లిలో బాబు రోడ్ షో
హైదరాబాద్ ను తానే కట్టినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించడంపై టీడీపీ అధినేత ఈ రోజు స్పందించారు. హైదరాబాదును, చార్మినార్ ను కట్టినట్లు తాను ఎన్నడూ ప్రచారం చేసుకోలేదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. తాను సైబరాబాద్ ను మాత్రమే నిర్మించాననీ, హైదరాబాద్ కు పేరు తీసుకొచ్చానని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎవరూ ఊహించని అభివృద్ధిని టీడీపీ ప్రభుత్వం చేపట్టిందన్నారు. శేరిలింగంపల్లిలో ఈ రోజు నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ..హైదరాబాద్ అభివృద్ధి తమ కష్టార్జితమని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం చొరవతోనే నేడు హైదరాబాద్ లో లక్షలాది మందికి ఐటీ ఉద్యోగాలు వచ్చాయని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఉన్న స్టేడియాలు, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్టు గతంలో నిర్మించినవేనని పేర్కొన్నారు. హైదరాబాద్ కు కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘనత తమదేనని చంద్రబాబు అన్నారు. గతంలో తాను హైదరాబాద్ ను అభివృద్ధి చేశానంటూ ప్రశంసించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇప్పుడు మాత్రం తనపై విమర్ళలు ఎక్కుపెడుతున్నారని వ్యాఖ్యానించారు.
మోదీ వస్తే దేశం బాగుపడుతుందని ఆశించామనీ, అయితే బీజేపీ ప్రభుత్వంతో ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని చంద్రబాబు అన్నారు. స్విస్ బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చి పంచుతామన్న మోదీ హయాంలో రూపాయి విలువ దారుణంగా పడిపోయిందని విమర్శించారు. ముస్లింలపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆరోపించారు. మోదీ పాలనలో దేశంలోని అన్ని ప్రభుత్వ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించినవారిని ఐటీ దాడులతో వేధిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.