kcr: కేసీఆర్ అంటే ‘కావో కమిషన్ రావు’: రాహుల్ గాంధీ
- ‘మిషన్ భగీరథ’ పేరిట నిధుల దుర్వినియోగం
- రాష్ట్రంలో 2.50 లక్షల కోట్ల మేరకు అప్పులు చేశారు
- రాష్ట్ర సంపదను కేసీఆర్ తన కుటుంబం కోసం వెచ్చిస్తున్నారు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ అంటే ‘కావో కమిషన్ రావు’ అని అభివర్ణించారు. ‘మిషన్ భగీరథ’ పేరిట రాష్ట్ర నిధులను దుర్వినియోగం చేశారని, రాష్ట్ర సంపదను తన కుటుంబం కోసం కేసీఆర్ వెచ్చిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 2.50 లక్షల కోట్ల మేరకు అప్పులు చేశారని, రైతు సమస్యలను పట్టించుకోవట్లేదని విమర్శించారు.
మద్దతు ధర అడిగిన రైతులపై లాఠీఛార్జీ చేశారని, పంటలకు నీళ్లడిగిన రైతులను అరెస్టు చేయించి జైల్లో పెట్టించారని, భూ నిర్వాసితులకు ఇంతవరకూ నష్టపరిహారం చెల్లించలేదని కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతుల అనుమతి లేకుండా వారి భూములను తీసుకోవద్దని భూసేకరణ చట్టంలో ఉందని, ఆ చట్టాన్ని రద్దు చేసి రైతుల భూములను బలవంతంగా తీసుకున్నారని విమర్శించారు. తాము అధికారంలోకొస్తే రైతు సమస్యలను పరిష్కరిస్తామని, 17 రకాల పంటలకు మద్దతు ధర కల్పిస్తామని, పసుపు పంటకు మద్దతు ధర అందేలా చూస్తామని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంపీ కవిత చెప్పారని, ఇంతవరకూ ఆ బోర్డును వారు తీసుకురాలేకపోయారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి బీడీ కార్మికులు, యాజమాన్యాలు తనను కలిశారని, వారి సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆ సమస్యలను కూడా పరిష్కరిస్తామని, బీడీ కార్మికులు, యాజమాన్యాలపై జీఎస్టీ భారం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.