Telangana: ఆధునిక తెలంగాణ సృష్టికర్తను నేనే!: ఏపీ సీఎం చంద్రబాబు
- కేసీఆర్ హయాంలో కొత్తగా ఏదైనా కట్టారా?
- గచ్చిబౌలి, హైటెక్ సిటీ.. నా హయాంలో వచ్చినవే
- కేసీఆర్ తన ఫామ్ హౌస్ తప్ప ఇంకేమీ కట్టలేదు!
ఆధునిక తెలంగాణ సృష్టికర్తను తానేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. హైదరాబాద్ లోని నిజాంపేటలో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, నాలుగున్నరేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్, హైదరాబాద్ లో ఒక్క రోడ్డుకైనా మట్టి వేశారా? ఆయన హయాంలో కొత్తగా ఏదైనా కట్టారా? అని ప్రశ్నించారు.
గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్ట్, మెట్రో.. ఇలా ఏది తీసుకున్నా అన్నీ తన హయాంలో వచ్చినవేనని, కేసీఆర్ తన హయాంలో ఏం చేశారో చెప్పాలని నిలదీస్తున్నానని అన్నారు. కేసీఆర్ తన ఫామ్ హౌస్ తప్ప ఇంకేమీ కట్టలేదని విమర్శించారు.
మాటలు తూలడం చాలా తేలిక అని, అనరాని మాటలు తనను అంటున్నాడని కేసీఆర్ పై మండిపడ్డారు. తెలంగాణలో తనకేంటీ పని అని కేసీఆర్ ప్రశ్నిస్తాడని, టీడీపీ అవసరమేంటని అంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఈ తెలంగాణ బాగుపడితే చూసి ఆనందించే మొదటి వ్యక్తిని తానేనని అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపైనా ఆయన విరుచుకుపడ్డారు. దేశాన్ని మారుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు కానీ, ఆయన్ని ఆయనే మార్చుకోలేకపోయారని విమర్శించారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు మన హైదరాబాద్ కు ఏమైనా పోలిక ఉందా? పన్నెండేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మోదీ, అహ్మదాబాద్ ను ఎందుకు తీర్చిదిద్దలేదని ప్రశ్నించారు.