Telangana: మిగులు బడ్జెట్తో అప్పగిస్తే ముంచేశారు.. కేసీఆర్పై చంద్రబాబు ఫైర్
- తెలంగాణలో టీడీపీ ఎందుకా?
- అది లేకుంటే ఆయనెక్కడ ఉండేవారు
- అప్పుడు నన్ను పొగిడి ఇప్పుడు విమర్శలా..
రెండు రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం శేరిలింగంపల్లి పరిధిలో ప్రజా కూటమి అభ్యర్థులకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగిస్తే కేసీఆర్ దానిని అప్పుల మయంగా మార్చారని ఆరోపించారు.
ఐటీ కంపెనీలు తీసుకొచ్చి తెలంగాణలో సంపద సృష్టించింది తానేనని గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో తాగేందుకు నీళ్లు కూడా లేవని, కాలేజీలు లేవన్నారు. మర్రి చెన్నారెడ్డి హయాంలో ఈ ప్రాంతంలో రెంగారెడ్డి జిల్లా కోసం కలెక్టరేట్ కడితే వచ్చేందుకు ఉద్యోగులు భయపడ్డారని పేర్కొన్నారు. అప్పట్లో ఎకరా పది వేల రూపాయల ధర పలికిన ఇక్కడి భూములు ఇప్పుడు రూ. 35 కోట్ల ధర పలుకుతున్నాయన్నారు. దీనికి కారణం ఐటీయేనని స్పష్టం చేశారు.
2009లో తమతో పొత్తుపెట్టుకున్నప్పుడు తెలంగాణలో సంపద సృష్టించిన వ్యక్తి చంద్రబాబే అని కేసీఆర్ తనను పొగిడారని, ఇప్పుడేమో రాజకీయ ప్రయోజనాల కోసం తనపై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో టీడీపీ ఎందుకని కేసీఆర్ అంటున్నారని, టీడీపీయే లేకపోతే కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చేవారని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో అభివృద్ధి ఏమాత్రం జరగలేదని చంద్రబాబు విమర్శించారు.