Rahul Gandhi: గాంధీ అనే పేరు లేకుంటే రాహుల్ జిల్లా అధ్యక్షుడు కూడా కాలేడు: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

  • గాంధీ కుటుంబంలో జన్మించారు కాబట్టే చీఫ్ అయ్యారు
  • రాహుల్ గోత్రం గురించి మాట్లాడింది అందుకే
  • నెహ్రూ, సర్దార్ పటేల్ వల్లే కాంగ్రెస్‌కు ఆ పేరు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాంధీ అనే ఇంటి పేరు లేకుంటే రాహుల్ కనీసం జిల్లా అధ్యక్షుడు కూడా అయి ఉండేవారు కాదని అన్నారు. ‘‘అతి పురాతన పార్టీకి ఇప్పుడు రాహుల్ గాంధీ అధ్యక్షుడు. జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ వంటి గొప్ప నేతలు ఆయన కంటే ముందు పనిచేసి పార్టీని ఉన్నత శిఖరాలకు చేర్చారు. నేనొక విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పగలను. రాహుల్ కనుక గాంధీ కుటుంబంలో జన్మించకపోయి ఉంటే ఆయన కనీసం జిల్లా అధ్యక్షుడు కూడా అయి ఉండేవాడు కాదు’’ అని మంత్రి పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ గోత్రంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ.. ఆ విషయం ప్రజల్లోకి వచ్చినందుకే బీజేపీ రాహుల్ గోత్రం గురించి ప్రశ్నించినట్టు వివరణ ఇచ్చారు. రాజస్థాన్‌లో రాహుల్ గాంధీ కౌల్ బ్రాహ్మిణ్ అని, గుజరాత్‌లో శివ భక్తుడిగా మారిపోతారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎవరు ఏ మతాన్ని అయినా విశ్వసించవచ్చని, అయితే, ఇందిరా గాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, జవహర్‌లాల్ నెహ్రూ కానీ ఎవరైనా ఇలా ప్రవర్తించారా? అని రవిశంకర్ ప్రశ్నించారు. మాట్లాడేందుకు వేరే విషయాలు లేకే ఇటువంటి విషయాలపై రాహుల్ రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి విమర్శించారు.

  • Loading...

More Telugu News