Andhra Pradesh: జగన్ పై హత్యాయత్నం ఘటనలో శ్రీనివాసరావును బలిపశువును చేశారు!: మేకపాటి
- బాబు రాకతో కరవు విలయతాండవం
- ధర్మపోరాట దీక్షతో రూ.కోట్ల దుర్వినియోగం
- వంచనపై గర్జన దీక్షలో మేకపాటి రాజమోహనరెడ్డి
చంద్రబాబు ఏ ముహూర్తాన అధికారంలోకి వచ్చారో తెలియదు కానీ, ఆంధ్రప్రదేశ్ లో కరవు విలయతాండవం చేస్తోందని వైసీపీ నేత, పార్లమెంటు మాజీ సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు స్వప్రయోజనాలు తప్ప మరేవీ పట్టవని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దెబ్బకు ఏపీలో వర్షం అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ధర్మపోరాట దీక్షల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆయన దుర్వినియోగం చేస్తున్నారని వాపోయారు. కాకినాడలో ఈరోజు ప్రారంభమైన ‘వంచనపై గర్జన దీక్ష’లో మేకపాటి మాట్లాడారు.
వైసీపీ అధినేత జగన్ పై నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాసరావు హత్యయత్నం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మేకపాటి ప్రశ్నించారు. దళిత యువకుడిని బలిపశువును చేశారని విమర్శించారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ద్వారా విచారణ జరిపిస్తే దోషులెవరో కచ్చితంగా తేలుతుందని వ్యాఖ్యానించారు.
బోట్ రేసు, ఎయిర్ షోల పేరుతో ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారనీ, సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు లాంటి పాలకుడికి మరోసారి అవకాశం ఇవ్వాలా? వద్దా? అన్నది రాష్ట్ర ప్రజలే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిని ఇంకా గ్రాఫిక్స్ లో చూపిస్తూ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.