New Delhi: దేశరాజధాని ఢిల్లీలో కదంతొక్కిన రైతులు...మద్దతు ధర, రుణమాఫీ కోసం నినాదాలు
- రామ్‌లీలా మైదానం నుంచి పార్లమెంటుకు రైతుల భారీ ర్యాలీ
- అఖిల భారత రైతు సంఘర్షణ సమితి నేతృత్వంలో ఆందోళన
- అయోధ్యలో ఆలయం కాదు...రుణ మాఫీ కావాలంటూ నినదించిన ఆందోళనకారులు
దేశరాజధాని ఢిల్లీలో రైతులు కదం తొక్కారు. అయోధ్యలో రామమందిరం కాదని, ముందు తమకు మద్దతు ధర, రుణమాఫీ కావాలని నినదించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని లక్షలాది మంది రైతులు గురువారం సాయంత్రానికి రాజధానిలోని రామ్‌లీలా మైదానానికి చేరుకున్నారు. రాత్రి అక్కడే బసచేసి శుక్రవారం ఉదయం ర్యాలీగా పార్లమెంటు వద్దకు బయుదేరి వెళ్లారు.
ఎర్రటోపీలు, జెండాలతో రైతులు ర్యాలీగా వెళ్తుంటే ఢిల్లీ వీధులు ఎర్రసముద్రాన్ని తలపించాయి. అఖిల భారత రైతు సంఘర్షణ సమితి (ఏఐకేఎస్‌సీసీ) నేతృత్వంలో జరుగుతున్న ర్యాలీకి పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయవాదులు, వైద్యులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, కళాకారులు మద్దతుగా తరలివచ్చారు.
రైతుల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమై చర్చించాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేయాలని, మద్దతు ధర నిర్ణయించుకునే అవకాశం రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళన కోసం ఢిల్లీకి వచ్చిన రైతులకు స్థానిక విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ఆప్ కార్యకర్తలు, నగరంలోని ఐదు గురుద్వారా కమిటీలు ఆహారం, ఇతరత్రా సహాయం అందిస్తున్నాయి.