Jammu And Kashmir: ‘భగత్ సింగ్ ఓ ఉగ్రవాది’ అన్న ప్రొఫెసర్.. కటకటాల వెనక్కి నెట్టిన పోలీసులు!
- జమ్మూకశ్మీర్ లోని వర్సిటీలో ఘటన
- ప్రొ.తాజుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- తన ప్రసంగాన్ని ఎడిట్ చేశారని ప్రొఫెసర్ ఆవేదన
జమ్మూకశ్మీర్ లో ఓ ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటిష్ వారి నుంచి భారత దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి అమరుడైన భగత్ సింగ్ ఉగ్రవాది అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై విద్యార్థులు యూనివర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. జమ్మూ యూనివర్సిటీకి చెందిన తాజుద్దీన్ రాజనీతి శాస్త్రం బోధిస్తున్నారు.
ఈ సందర్భంగా పాఠం చెబుతూ..‘భగత్ సింగ్ ఓ ఉగ్రవాది’ అని వ్యాఖ్యానించారు. ప్రొ.తాజుద్దీన్ వ్యాఖ్యలతో తీవ్రంగా కలత చెందిన యువతీయువకులు వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ కు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వర్సిటీ తీవ్రంగా స్పందించింది. ప్రొ.తాజుద్దీన్ ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ విధుల్లోకి రావొద్దని స్పష్టం చేసింది.
మరోవైపు ఈ వివాదంపై ప్రొ.తాజుద్దీన్ స్పందించారు. తాను భగత్ సింగ్ పై ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ప్రపంచ రాజకీయ వ్యవస్థ, రష్యన్ విప్లవం గురించి చెప్పే క్రమంలో తీవ్రవాద కార్యకలాపాలపై చర్చించామని తెలిపారు. తాను రెండున్నర గంటల పాటు ప్రసంగిస్తే.. అందులోని కొన్ని నిమిషాల వీడియోను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాగా, మరోవైపు తాజుద్దీన్ వ్యాఖ్యలపై ఓ వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.