Telangana: మహేందర్ రెడ్డి డీజీపీ అయ్యాక నాకు వేధింపులు ఎక్కువయ్యాయి.. ఎన్నికల ప్రచారాన్ని ఆపేస్తున్నా!: రేవంత్ రెడ్డి
- నాకు ప్రాణహాని ఉందని చాలాసార్లు చెప్పాను
- కోర్టు 4+4 రక్షణ కల్పించాలని ఆదేశించింది
- అయినా కేంద్రం, రాష్ట్రం పట్టించుకోవడం లేదు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని 3 రోజుల పాటు రద్దు చేసుకున్నారు. తనకు ప్రాణహాని ఉందని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు, సత్తుపల్లి ప్రాంతాల్లో ఈ రోజు జరిగే ఎన్నికల ప్రచారంలో రేవంత్ పాల్గొనాల్సి ఉంది. అయితే తనపై దాడులు జరగొచ్చన్న భయంతో 3 రోజుల పాటు తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు.
అంతేకాకుండా తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిపై సైతం రేవంత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేందర్ రెడ్డి డీజీపీ అయ్యాక కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు తనకూ వేధింపులు పెరిగాయని ఆరోపించారు. తనకు 4 ప్లస్ 4 భద్రతను కల్పించాలని హైకోర్టు ఆదేశించినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తన పర్యటనలను పోలీసులు అడ్డుకుంటున్నారనీ, చివరి నిమిషం వరకూ అనుమతులు లేవని సాకులు చెబుతూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.