justice punnayya: మాజీ స్పీకర్ ప్రతిభా భారతికి పితృ వియోగం.. విశ్రాంత జస్టిస్ పున్నయ్య మృతి
- గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పున్నయ్య
- చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచినట్లు ప్రకటన
- పున్నయ్య స్వస్థలం శ్రీకాకుళం జిల్లా కావలి
విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కె.పున్నయ్య (96) కన్నుమూశారు. ఈయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతికి తండ్రి. శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం కావలికి చెందిన జస్టిస్ పున్నయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అక్టోబరు 25న ఆయన అస్వస్థులు కావడంతో విశాఖపట్నంలోని పినాకిల్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి మెరుగుపడక పోవడంతో శనివారం తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.
1952లో రెండేళ్లపాటు న్యాయవాదిగా పనిచేసిన జస్టిస్ పున్నయ్య శ్రీకాకుళం జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1955లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జెడ్పీ ఉపాధ్యక్షుడిగా కూడా కొన్నాళ్లు పనిచేశారు. 1962లో రాజకీయాలకు స్వస్తి పలికి హైకోర్టు న్యాయవాదిగా వెళ్లారు. 1974-85 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2000 సంవత్సరం ఎన్టీయే ప్రభుత్వ హయాంలో ఎస్సీఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు.